జీవితంలో విజయ తీరాలు చేరిన ఎవరిని పలకరించినా.. కష్టాలు వారిని ఎలా వెంటాడాయో.. విధి వారితో ఎలా ఆడుకుందో కథలు కథలుగా చెప్పుకొస్తారు. ఒక కొందరు ఎదుర్కొన్న కష్టాలు చూస్తే.. అసులు వీరు ఎలా బతికి ఉన్నారా అనిపిస్తుంది. ఎన్నో కష్టాలను దాటుకుని.. మొక్కవోని ధైర్యంతో ముందడుగు వేశారు కాబట్టే.. నేడు విజయతీరాలకు చేరుకున్నారు. కానీ నేటి కాలంలో ముఖ్యంగా యువతలో కష్టాలను తట్టుకునే ఆత్మవిశ్వాసం లోపిస్తుంది. అపజయాలు కాదు కదా.. నో అనే మాటను కూడా తట్టుకోలేకపోతున్నారు. క్షణికావేశంలో తీవ్రమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. అందమైన నూరేళ్ల జీవితాన్ని క్షణకాలంలో ముగిస్తున్నారు. వారిపైనే ఎన్నో ఆశలు పెట్టుకున్న తల్లిదండ్రుల గుండెల్లో ఆరని చితి వెలిగిస్తున్నారు. తాజాగా ఈ కోవకు చెందిన సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది.
21 సంవత్సరాల వయసు అంటే.. ఎంతో చురుగ్గా.. ఉత్సాహంగా.. ఆత్మ విశ్వాసంతో ఉంటారు కదా. ఇక ఎదిగిన పిల్లల బంగారు భవిష్యత్తును తలుచుకుని తల్లిదండ్రులు కూడా ఎన్నో కలులు కంటారు. ఆ యువతి విషయంలో కూడా తల్లిదండ్రులు అలానే భావించారు. అల్లారుముద్దుగా పెంచుకున్నారు. అడింగిందల్లా తెచ్చిచ్చారు. తమకున్నంతలో ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకున్నారు. ప్రేమించి, శ్రద్ధగా చూసుకునే తల్లిదండ్రులు, మంచి స్నేహితులు. సంతోషంగా గడిచిపోతున్న జీవితం. మరి ఇంతలో ఏమయ్యిందో తెలియదు కానీ.. ఆ 21 ఏళ్ల యువతి ఊహించని నిర్ణయం తీసుకుంది. 20వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఆ వివరాలు..
ఈ విషాదకర సంఘటన హైదరాబాద్‌లో చోటు చేసుకుంది. పటాన్‌చెరులోని ఏపీఆర్ ఫామ్స్‌లో నివాసం ఉంటున్న మణినాథ్, సౌందర్యలకు కోమలిక(21) అనే కుమార్తె ఉంది. ప్రస్తుతం తను మియాపూర్‌లోని నిజాం కాలేజీలో బీఏ సెకండ్ ఇయర్ చదువుతోంది. ఇక కోమలిక అమ్మమ్మ, తాతయ్యలు మియాపూర్‌లోనే నివాసం ఉంటున్నారు. కోమలిక గత ఆరు నెలలుగా వారితో పాటు కలిసి ఉంటుంది. ఈ క్రమంలో మంగళవారం కాలేజీ అయ్యాక ఇంటికి వచ్చిన కోమలిక.. కొద్ది సేపటికి బిల్డింగ్ మీదకు వెళ్లింది. 20వ అంతస్తుపైకి చేరుకుని అక్కడ నుంచి కిందకు దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనలో కోమలిక తల, మిగతా శరీర భాగాలకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనలో కోమలిక అక్కడికక్కడే మృతి చెందింది.
విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన ప్రాంతానికి వచ్చి.. దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలో ఆమె ‘‘డైరీలో నాకు చనిపోవాలని అనిపిస్తోంది.. నా జీవితాన్ని చాలించుకుంటున్నాను’’ అని ఇంగ్లీష్‌లో రాసి ఉండటం గమనించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. కోమలిక ఫోన్‌ను స్వాధీనం చేసుకుని పరిశీలిస్తున్నారు. ఇక కోమలిక మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం.. గాంధీ ఆస్పత్రికి తరలించారు.