వాళ్లిద్దరూ భార్యాభర్తలు. వీరికి చాలా ఏళ్ల కిందటే వివాహం జరిగింది. పెళ్లైన కొంత కాలానికి ఈ దంపతులకు ఇద్దరు కూతుళ్లు జన్మించారు. అయితే ఓ కారణంతో ఇటీవల భర్త అందరి ముందే భార్యను మురికి కాలువలో ముంచి దాడికి పాల్పడ్డాడు. ఎందుకో తెలుసా?
ఈ మధ్యకాలంలో కొందరు భర్తలు బరితెగించి ప్రవర్తిస్తున్నారు. ప్రతీ చిన్న సమస్యకు భార్యపై చేయి చేసుకుంటూ చివరికి దారుణాలకు తెగబడుతున్నారు. అచ్చం ఇలాగే హద్దులు దాటిన ఓ భర్త.. అందరి ముందే తన భార్యను దారుణంగా చితకబాదాడు. అంతేకాకుండా ఏకంగా మురికి కాలువలో ముంచి చితకబాదాడు. ఈ సీన్ చూసిన స్థానికులు అంతా ఒక్కసారిగా షాక్ గురై వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని షాడిస్ట్ భర్తను అరెస్ట్ చేశారు. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది.
పోలీసుల కథనం ప్రకారం.. మధ్య ప్రదేశ్ ఉజ్జయినిలోని ఓ ప్రాంతంలో రజాక్-సల్మా దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి 2004లో వివాహం జరిగింది. పెళ్లైన నాటి నుంచి ఎలాంటి గొడవలు లేకుండా సంతోషంగా జీవించారు. అలా కొన్నేళ్ల తర్వాత ఈ దంపతులకు ఓ కూతురు జన్మించింది. దీంతో తల్లిదండ్రులు సంతోషపడ్డారు. మరో ఏడాది తిరిగే సరికి ఇంకో కూతురు జన్మించింది. ఈసారి కూడా కూతురు జన్మించడంతో భర్త రజాక్ తీవ్ర అసహనానికి గురయ్యాడు. అప్పటి నుంచి భార్యపై కోపంతో ఊగిపోయాడు.
ఇద్దరు కూతుళ్లు జన్మించడంతో అత్తింటివారు సైతం సల్మాను సూటిపోటి మాటలతో వేధింపులకు గురి చేసేవారు. అయితే సల్మా మరోసారి గర్భం దాల్చితే మళ్లీ ఆడపిల్లే పుడుతుందేమోనని అత్తింటివాళ్లు అనుమానపడ్డారు. ఇలా అయితే కాదని, రజాక్ ను రెండో పెళ్లి చేసుకోవాలంటూ సలహాలిచ్చారు. దీనికి రజాక్ కూడా చంకలు గుద్దుకుంటూ సరేనని రెండో పెళ్లికి సిద్దమయ్యాడు. అంతకంటే ముందు రజాక్ తన భార్య సల్మాకు విడాకులు ఇవ్వాలని అనుకున్నాడు. ఇందులో భాగంగానే రజాక్ భార్యను విడాకులు ఇవ్వాలని కోరాడు. దీనికి సల్మా నిరాకరించింది. ఇదే విషయంపై గత కొన్ని రోజుల నుంచి దంపతుల మధ్య తరుచు గొడవలు జరుగుతూనే ఉన్నాయి.
ఇటీవల మరోసారి ఇద్దరూ గొడవ పడ్డారు. దీంతో ఒకరిపై ఒకరు మాటల దాడి చేసుకున్నారు. ఈ క్రమంలోనే కోపంతో ఊగిపోయిన భర్త రజాక్.. భార్య సల్మాపై దాడి చేశాడు. నడి రోడ్డుపై అందరిముందే దాడికి పాల్పడ్డాడు. అంతేకాకుండా ఇంటి ముందు ఉన్న మురికి కాలువలో భార్యను ముంచి చితకబాదాడు. దీనిని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు రజాక్ ను అరెస్ట్ చేశారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.