స్వచ్ఛమైన ప్రేమ అనే మాట ఈ మధ్య పుస్తకాలు, కథలకే పరిమితం అవుతుంది. ప్రస్తుత సమాజంలో ప్రేమ పేరుతో జరుగుతున్న అరాచకాలు అన్ని ఇన్నీ కావు. ప్రేమించకపోతే చంపేయడం.. ఒప్పుకోకపోతే చనిపోవడం ఇవే ఎక్కువగా జరుగుతున్నాయి. ఇలాంటి దారుణాల మధ్య కూడా ప్రేమ గొప్పదనాన్ని తెలిపే సంఘటనలు అక్కడక్కడా చోటు చేసుకుంటాయి. తాజాగా ఈ కోవకు చెందిన సంఘటన ఒకటి మధ్యప్రదేశ్ లో వెలుగు చూసింది.
భార్యను ప్రాణంగా ప్రేమించాడు ఓ భర్త. ఆమె మాత్రం మరో వ్యక్తిని ఇష్టపడింది. ప్రియుడి కోసం.. భర్తను అడ్డు తొలగించుకోవాలని అతడిపై హత్యాయత్నం చేసింది. అయితే అదృష్టవశాత్తు అతడు ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. ఇంత దారుణానికి ఒడిగట్టింది భార్యే అని తెలిసినా.. అతడు ఆమె కావాలని కోరుకుంటున్నాడు. ఆ వివరాలు..
ఇది కూడా చదవండి : విజయవాడ: బాలిక ఆత్మహత్యకి కారణమైన వినోద్ జైన్ ఎవరు?
ఛతర్‌పూర్ జిల్లాలోని లవ్‌కుష్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసం ఉంటున్న సంతోష్ కు భార్య సుధ, ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే అక్కడే నివసించే ప్రమోద్ అనే వ్యక్తితో సంతోష్ భార్య సుధ వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ విషయం భర్త సంతోష్ కు తెలిసింది. ఈ విషయంలో భార్యకు నచ్చజెప్పేందుకు ఎంతో ప్రయత్నించాడు. ఇది సరైన పద్ధతి కాదని నలుగురితో చెప్పించాడు. అయినా ఆమె మారలేదు. అతనికి భార్య అంటే ప్రేమ ఎక్కువ. అందుకే ఆమెను దూరం చేసుకోవాలనుకోలేదు.
మరోవైపు సుధ మాత్రం తనను ప్రాణంలా ప్రేమించే భర్తను చంపాలని నిర్ణయించుకుంది. అతడు తాగే టీలో విషం కలిపింది. దీంతో సంతోష్ ఆస్పత్రి పాలయ్యాడు. తనను చంపాలని ప్రయత్నించినా.. సంతోష్‌కు మాత్రం భార్య మీద ఏ మాత్రం కోపం రాలేదు. పైగా తనకు ఇద్దరు పిల్లలు ఉన్నారని, తనకు తన భార్యే కావాలంటూ చెప్పుకొచ్చాడు. ప్రమోద్ తన భార్యను వదలడానికి ఇష్టపడటం లేదని సంతోష్ వాపోయాడు. తన భార్యపై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు కూడా సంతోష్ ఇష్టపడటం లేదు. తన భార్య తనను చూడటానికి వస్తే మరోసారి ఆమెకు నచ్చజెప్పేందుకు ప్రయత్నిస్తానని చెప్పుకొచ్చాడు. అయితే భర్త ఆస్పత్రిలో చేరినా అతడి భార్య సుధ మాత్రం సంతోష్ ని చూడటానికి రాలేదు.