ఏపీలో దారుణం చోటు చేసుకుంది. ఓ మహిళ ప్రియుడిపై మోజుతో భర్తను హత్య చేయించింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది.
ఈ మధ్యకాలంలో కొందరు పెళ్లైన దంపతులు వివాహేతర సంబంధాల మోజులో పడి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. భార్యను కాదని భర్త, భర్తను కాదని భార్య ఇలా ఒకరికి తెలియకుండా ఒకరు అక్రమ సంబంధాల్లో దూరి చివరికి హత్యలు ఆత్మహత్యలతో దారుణాలకు తెగబడుతున్నారు. అచ్చం ఇలాగే బరితెగించిన ఓ ఇల్లాలు ప్రియుడిపై మోజుతో భర్తను హత్య చేయించింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. అసలేం జరిగిందంటే?
పోలీసుల కథనం ప్రకారం.. ఏపీలోని కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం మాధరం గ్రామం. ఇక్కడే ఉప్పర నారాయణ-వరలక్ష్మి దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి 15 ఏళ్ల కిందటే వివాహం జరిగింది. పెళ్లైన కొంత కాలానికి ఈ దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు జన్మించారు. ఇక భర్త నారాయణ కూలీ పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అయితే రాను రాను నారాయణ తాగుడుకు బానిసయ్యాడు. అంతేకాకుండా స్థానికంగా ఉండే ఓ మహిళతో వివాహేతర సంబంధాన్ని కూడా కొనసాగించినట్లు సమాచారం.
ఇదే విషయమై భార్యాభర్తల మధ్య అనేకసార్లు గొడవలు కూడా జరిగాయి. దీంతో విసుగు చెందిన వరలక్ష్మి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ విషయం తెలుసుకున్న ఆమె తల్లిదండ్రులు వరలక్ష్మిని పుట్టింటికి తీసుకెళ్లారు. ఆ మహిళ కొన్నాళ్ల పాటు తల్లిదండ్రుల ఇంట్లోనే ఉంది. అలా కొంత కాలం తర్వాత వరలక్ష్మి బంధువైన చిన్న గోవిందుకు దగ్గరైంది. దీంతో ఇద్దరూ వివాహేతర సంబంధాన్ని కొనసాగించారు. ఈ క్రమంలోనే వరలక్ష్మి ప్రియుడికి ఇంకాస్త దగ్గరైంది. ఇక భర్తతో ఉండకుండా ప్రియుడితోనే ఉండాలనుకుంది.
కానీ, ఆమెకు భర్తపై ఉన్న పగ మాత్రం పోలేదు. ప్రియుడితో చేతులు కలిపి వరలక్ష్మి భర్త నారాయణను అంతం చేయాలని అనుకుంది. తాను అనుకున్నట్లుగానే ఆ మహిళ 2022 మే 27న ప్రియుడు చిన్న గోవింద్ తో భర్త నారాయణకు ఫోన్ చేయించి ఓ చోటుకు రావాలంటూ నాటకం ఆడించింది. వారు చెప్పినట్లే నారాయణ కూడా వెళ్లాడు. అక్కడికి వెళ్లిన తర్వాత చిన్న గోవిందు, నారాయణ ఇద్దరూ కలిసి మద్యం సేవించారు. నారాయణకు మత్తులోకి వెళ్లాక చిన్న గోవింద్ వరలక్ష్మిని రమ్మని పిలిచాడు. అనంతరం ఇద్దరూ కలిసి నారాయణను కర్నూలు రైల్వే స్టేషన్ వరకు తీసుకెళ్లారు. ఇక అక్కడికి వెళ్లాక మద్యం మత్తులో ఉన్న నారాయణను రైల్వే ట్రాక్ పై పడుకోబెట్టి వరలక్ష్మి, చిన్న గోవింద్ అక్కడి నుంచి వెళ్లిపోయారు.
దీంతో నారాయణపై రైలు వెళ్లడంతో అతడు మరణించాడు. ఏం తెలియనట్టుగా వరలక్ష్మి నా భర్త కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే పోలీసులు కాల్ డేటా ఆధారంగా భార్య వరలక్ష్మిని విచారించగా అసలు నిజాలు వెలుగులోకి వచ్చాయి. నేరాన్ని అంగీకరించడంతో వరలక్ష్మితో పాటు ఆమె ప్రియుడు చిన్న గోవిందును పోలీసులు అరెస్ట్ చేశారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది.