ప్రేమ పేరుతో జరుగుతున్న దారుణాలకు హద్దు, అదుపు లేకుండా పోతోంది. కొంతమంది కిరాతకులు ప్రేమంటే ఏంటో కూడా తెలియకుండా సైకోల్లాగా ప్రవర్తిస్తున్నారు. తాజాగా, ఓ యువకుడు తనకు బ్రేకప్ చెప్పిందన్న పగతో ప్రియురాలిని దారుణంగా చంపేశాడు. ఆమె బెడ్‌రూమ్‌లోనే ఆమెను పొట్టన పెట్టుకున్నాడు. ఈ సంఘటన కేరళలో శనివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కేరళ, కన్నూర్ జిల్లాలోని పనూర్‌కు చెందిన విష్ణుప్రియ మనతేరి ప్రాంతానికి చెందిన శ్యామజిత్ ప్రేమించుకున్నారు. వీరి ప్రేమ వ్యవహారం కొంత కాలం బాగానే నడిచింది. అయితే, గత కొద్దిరోజుల నుంచి వీరి ప్రేమలో కలహాలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో విష్ణుప్రియ, శ్యామజిత్‌కు బ్రేకప్ చెప్పింది. ఇక, అప్పటినుంచి అతడికి దూరంగా ఉంటోంది.
అయితే, విష్ణుప్రియ బ్రేకప్ చెప్పటం శ్యామజిత్‌కు నచ్చలేదు. ఆమెకు నచ్చజెప్పటానికి ఎంతో ప్రయత్నించాడు. అయినా ఆమె ఒప్పుకోలేదు. దీంతో ఆమెపై పగ పెంచుకున్నాడు. ఆమెపై ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నాడు. అందుకు సరైన సమయం కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. విష్ణుప్రియ ఓ ప్రైవేట్ ల్యాబ్‌లో పనిచేస్తోంది. శనివారం యధావిధిగా ల్యాబ్‌కు వెళ్లింది. విధుల్లో ఉండగా ఆమెకు ఓ ఫోన్ వచ్చింది. విష్ణుప్రియ బంధువొకరు చనిపోయినట్లు సమాచారం అందింది. దీంతో ఆమె ఇంటికి వెళ్లింది. విష్ణు ప్రియ ఇంట్లో వారందరూ చావు ఇంటికి వెళ్లారు. ఆమె ఒక్కత్తే ఇంట్లో ఉంది. విష్ణు ప్రియ ఒక్కత్తే ఇంట్లో ఉందని గుర్తించిన శ్యామజిత్ అక్కడికి వచ్చాడు.
నేరుగా ఆమె బెడ్ రూమ్‌లోకి వెళ్లాడు. బ్రేకప్ విషయమై ఆమెతో గొడవపెట్టుకున్నాడు. తర్వాత వెంట తెచ్చుకున్న కత్తితో ఆమెపై విచక్షణా రహితంగా దాడిచేశాడు. అనంతరం ఆమె గొంతుకోసి అక్కడినుంచి వెళ్లిపోయాడు. కత్తి పోట్ల కారణంగా తీవ్ర రక్తస్రావం కావటంతో అక్కడికక్కడే చనిపోయింది. అంత్యక్రియల అనంతరం కుటుంబసభ్యులు ఇంటికి చేరుకున్నారు. ఇంట్లో రక్తపు మడుగుల్లో పడి ఉన్న విష్ణుప్రియను చూసి షాక్ తిన్నారు. ఆమె చనిపోయిందని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. సీసీటీవీ ఆదారంగా శ్యామజిత్‌ను అరెస్ట్ చేశారు.