ఆమె పేరు రాజేశ్వరి. జోగులాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలం మునగాల. ఇదే గ్రామానికి చెందిన రాజేశ్వరి చిన్నప్పటి నుంచే చదువులో బాగా రాణించేది. ఎప్పటికైన ఉన్నత చదువులు చదివి అనుకున్న లక్ష్యాన్ని సాధించాలనే కలలు కనేది. అయితే పదో తరగతిలో మంచి మార్కులతో పాస్ అయిన ఈ అమ్మాయి జిల్లాలోని కేజీబీవీ కాలేజీలో ఇంటర్ చదివింది. ఈ మధ్యకాలంలో జరిగిన ఇంటర్ పరీక్షల్లో కూడా స్నేహితులతో పాటు ఎంతో ఉత్సహంగా పాల్గొంది. చదువులో రాజేశ్వరి బాగా రాణిస్తుండడంతో తల్లిదండ్రులతో పాటు కాలేజీ యాజమాన్యం కూడా ఎప్పుడు ప్రోత్సహించేవారు.
అయితే పరీక్షల అనంతరం రాజేశ్వరి తన తండ్రితో పాటు ఇంటికి వస్తుండగా మే 19న ఇద్దరు రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఈ ప్రమాదంలో అమ్మాయి రాజేశ్వరితో పాటు ఆమె తండ్రి కూడా ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఒకే ఇంట్లో తండ్రీకూతురు ఒకేసారి ప్రమాదంలో మరణించడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. ఇదిలా ఉంటే.. మంగళవారం ఇంటర్ ఫలితాలు విడుదలైన విషయం తెలిసిందే.
అయితే ఈ ఫలితాల్లో రాజేశ్వరి ఎంపీసీలో ఏకంగా 867 మార్కులతో జిల్లాలోనే టాపర్ గా నిలిచింది. ఇంత ప్రతిభ గల రాజేశ్వరి ఇప్పుడు లేకపోవడంతో ఆమె కుటుంబ సభ్యులు, చదువు చెప్పిన మాస్టారులో కంటతడి పెడుతున్నారు. ఎన్నో ఆశలతో జీవితంలో అనుకున్నది సాధించాలనే ప్రయత్నంలో అడుగులు వేసిన రాజేశ్వరి ఊహించని ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరం. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.