Crime News: జార్ఖండ్‌లో వంద కోట్ల రూపాయల మైనింగ్ స్కాంకు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు వేగవంతం చేసింది. బుధవారం 20 చోట్ల సోదాలు నిర్వహించింది. జార్ఖండ్‌తోపాటు బిహార్, తమిళనాడు, ఢిల్లీలలోని 20 ప్రదేశాల్లో సోదాలు జరిపింది. ఈ నేపథ్యంలోనే స్కాంలో హస్తం ఉందని భావిస్తున్న ప్రేమ్ ప్రకాశ్ అనే మధ్యవర్తి ఇంటిని రైడ్ చేసింది. రైడ్ సందర్బంగా ఇంట్లో రెండు ఏకే 47 రైఫిళ్లు కనిపించాయి. బీరువాలో జాగ్రత్తగా దాచిన వాటిని ఈడీ అధికారులు గుర్తించారు. రెండు ఏకే 47 గన్నులు, 60 బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. ప్రేమ్ ప్రకాశ్‌పై గోదా బీజేపీ ఎంపీ నిశాంత్ దూబే ఓ ట్వీట్ చేశారు. ప్రేమ్ ప్రకాశ్ జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్, అతని స్నేహితుడయిన అమిత్ అగర్వాల్‌కు సహచరుడని పేర్కొన్నాడు.
రెండు ఏకే 47లపై ఎన్‌ఐఏ దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశాడు. ప్రేమ్ ప్రకాశ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ స్నేహితుడని వస్తున్న వార్తలపై సీఎం హేమంత్ సోరెన్ స్పందించారు. తనకు ప్రేమ్ ప్రకాశ్‌కు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. కాగా, మైనింగ్ స్కాంకు సంబంధించి ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ సన్నిహితుడైన పంకజ్ మిశ్రాను ఇప్పటికే ఈడీ విచారించింది. ఆ విచారణలోనే ప్రేమ్ ప్రకాశ్ పేరు బయటకు వచ్చినట్లు సమాచారం. ఇప్పటికే స్కాంతో సంబంధం ఉన్న పలువురిని ఈడీ అరెస్ట్ చేసింది. పంకజ్ మిశ్రాను, బచ్చు యాదవ్‌లను అదుపులోకి తీసుకుంది. మరి, ముఖ్యమంత్రి సన్నిహితుడి ఇంట్లో 2 ఏకే 47 రైఫిళ్లు లభించటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : వ్యాపారికి కొడుక్కి ఎర.. పుష్ప గ్యాంగ్ అదిరిపోయే ప్లాన్!