నగరంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. జీహెచ్‌ఎంసీ పరిధిలోని లలిత్‌భాగ్ కార్పొరేటర్ కార్యాలయంలో యువకుడిపై గుర్తు తెలియని దుండగులు కత్తులతో దాడి చేశారు. తీవ్ర కత్తిపోట్లకు గురైన యువకుడిని ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మరణించాడు. ఇదొక గ్యాంగ్ వార్ అని చెప్తున్నారు. వివరాల్లోకి వెళితే.. భవానీనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని లలితాభాగ్‌కు చెందిన ఎంఐఎం కార్పొరేటర్ ఆజం షరీఫ్ కార్యాలయంలోకి గుర్తు తెలియని వ్యక్తులు చొరబడి, అతని మేనల్లుడు సయ్యద్ ముర్తజా అనస్ పై కత్తులతో దాడి చేశారు. తీవ్ర గాయాలపాలైన యువకుడిని హుటాహుటీన ఆస్పతికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందాడు.
మృతుడు కార్పొరేటర్ ఆజం షరీఫ్ సోదరి కొడుకే. అతడు బంజారాహిల్స్‌లోని ఓ ప్రైవేటు కాలేజీలో చదువుతున్నాడు. కార్పొరేటర్ కార్యాలయంలో ఉండగానే ఏకకాలంలో దుండగులు దాడికి పాల్పడ్డారు. కాగా, సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిని సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నారు. ఆరుగురు కలిసి అనస్‌పై దాడి చేసినట్లు పోలీసులు గుర్తించారు. స్నేహితుల మధ్య గొడవే హత్యకు కారణమని పోలీసులు భావిస్తున్నారు.