ఆ చిన్నారులు ఈ భూమ్మీదకు వచ్చి పట్టుమని పది రోజులు కూడా కావడం లేదు. ఇంకా కళ్లు కూడా సరిగా తెరవలేదు. ఆకలేస్తే.. అమ్మ పాలు తాగడం.. నిద్ర పోవడం ప్రస్తుతం ఇదే వారి దినచర్య. తల్లి పక్కలో వెచ్చగా నిద్రపోతూ గడపాల్సిన ఆ చిన్నారులు నీటి సంపులో శవాలై కనిపించారు. రోజుల పసిగుడ్డు అనే కనికరం లేకుండా ఇంత దారుణానికి పాల్పడింది ఎవరు అంటే కన్నతల్లి.. మరి ఆ తల్లి కసాయిగా ఎందుకు మారింది అంటే..
మేనరిక సంబంధాలు చేసుకుంటే.. పిల్లలు అనేక అనారోగ్య సమస్యలతో పుడతారని వైద్యులు హెచ్చరిస్తున్నప్పటికి నేటికి కూడా మన సమాజంలో మేనరికం వివాహాలు ఆగడం లేదు. మేనరికపు వివాహాలు చేసుకున్న వారిలో కొందరికి మానసిక, శారీరక అంగవైకల్యం ఉన్న పిల్లలు జన్మించడం చూస్తూనే ఉన్నాం. ఇక తాజాగా ఇదే కోవకు చెందిన ఒకటి వెలుగు చూడగా.. ఆ తల్లి చేసిన పనికి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా ఏడుస్తున్నారు. మేనరికం వివాహం కారణంగా పుట్టిన పిల్లలంతా ఏదో లోపంతో జన్మించడం.. మధ్యలోనే మృతి చెందడం చూసి ఆ తల్లి మనసు చలించింది. 9 రోజుల క్రితం పండంటి కవలలకు జన్మనిచ్చింది. కానీ గత అనుభవాలు ఆమెను భయపెట్టాయి. ఈ పిల్లలకు కూడా చనిపోతారని భావించి ముక్కుపచ్చలారని పసికందులను దారుణంగా చంపేసి.. తాను ఆత్మహత్య చేసుకుంది. ఆ వివరాలు..
ఈ విషాదకర సంఘటన హైదరాబాద్ బేగంపేట పరిధిలో చోటు చేసుకుంది. అన్నానగర్‌కు చెందిన సంధ్యారాణి(29)కి 2012లో వివాహం జరిగింది. ఆమె భర్త నర్సింగ్ రావు డ్రైవర్‌గా పని చేసేవాడు. వీరిది మేనరిక వివాహం. ప్రస్తుతం వీరు కానాజిగూడ పరిధిలోని శివనగర్‌లో నివాసం ఉంటున్నారు. ఈ క్రమంలో వీరికి పెళ్లైన ఐదేళ్ల తర్వాత అనగా 2017లో కవలలు జన్మించారు. అయితే చిన్నారుల్లో ఓ శిశువు అంగవైకల్యంతో జన్మించగా.. మరొక శిశువుకు గుండెలో రంధ్రాలు ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. ఇక వారం రోజుల వ్యవధిలోనే ఇద్దరు కవలలు మృతి చెందారు.
2018లో సంధ్యారాణి మరోసారి గర్భం దాల్చింది. కానీ శిశువు కడుపులోనే మృతి చెందడంతో.. గర్భస్రావం అయ్యింది. ఇక అప్పటి నుంచి ఆమె మానసికంగా వేదనకు గురవ్వసాగింది. ఈ క్రమంలో గతేడాది మరోసారి గర్భం దాల్చింది సంధ్యారాణి. ఈ ఏడాది ఫిబ్రవరి 11న కవలలకు జన్మనిచ్చింది. అయితే ఈ సారి కూడా నెలలు నిండాకుండానే బిడ్డలకు జన్మనివ్వడం.. వారిలో మగ శిశువు బరువు తక్కువగా ఉండటంతో.. కొన్ని రోజుల పాటు ఐసీయూలో ఉంచారు. ఫిబ్రవరి 14న తల్లీబిడ్డలు ఇంటికి వచ్చారు. అయితే పాత జ్ఞాపకాలు సంధ్యారాణిని వెంటాడాయి. గతంలో కూడా కవలలు ఇలానే మృతి చెందడం ఆమెను కలవరపాటుకు గురి చేసింది. ఈ బిడ్డలు కూడా చనిపోతారని తీవ్రంగా భయపడసాగింది. ఈ క్రమంలో దారుణానికి పాల్పడింది.
ఈ క్రమంలో ఆదివారం అర్థరాత్రి ఓ దారుణ నిర్ణయం తీసుకుంది. ఈ బిడ్డలు కూడా చనిపోతారనే భయంతో 9 రోజుల పసికందులను ఇంటి ఆవరణలోని సంపులో పడేసి.. తాను కూడా దానిలో దూకి ఆత్మహత్య చేసుకుంది సంధ్యారాణి. తెల్లవారుజామున మెలకువ వచ్చిన భర్తకు భార్యాబిడ్డలు కనిపించకపోవడంతో.. ఆందోళనకు గురై ఇంటి ఆవరణలో వారి కోసం వెతకడం ప్రారంభించాడు. ఈ క్రమంలో సంపు తెరిచి ఉండటం చూసి.. అనుమానం కొద్ది అందులోకి తొంగి చూడగా.. భార్యాబిడ్డల మృతదేహాలు దర్శనం ఇచ్చాయి.
ఇక బిడ్డల ఆరోగ్య పరస్థితి.. గతంలో చోటు చేసుకున్న సంఘటనల కారణంగానే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంధ్యారాణి రాసిన లేఖను ఇంట్లో గుర్తించారు పోలీసులు. రోజుల పసికందులని కూడా చూడకుండా ఇంతటి దారుణానికి పాల్పడటంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మరి సంధ్యారాణి తీసుకున్న నిర్ణయం సరైందేనా.. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలోతెలియజేయండి.