షాపింగ్ మాల్స్, టాయిలెట్ రూమ్ లు, హాస్టల్ రూమ్స్ లలోనే కాదు అద్దెకు తీసుకునే ఇళ్లలోనూ రహస్య కెమెరాలను పెడుతున్నారు. కొంతమంది దుర్మార్గులు అద్దెకు వచ్చే అమ్మాయిల మీద కన్నేస్తున్నారు.
షాపింగ్ మాల్స్ లోని డ్రెస్సింగ్ రూమ్స్ లో, బాత్రూముల్లో ఇలా ఎక్కడపడితే అక్కడ రహస్య కెమెరాలను పెడుతున్నారు. రికార్డ్ అయిన వీడియోలను ప్రైవేట్ వెబ్ సైట్లలో అప్లోడ్ చేసి శునకానందం పొందుతున్నారు. అయితే ఈ ట్రెండ్ ఇప్పుడు అద్దె కొంపల్లో కూడా దాపురించింది. యువతులకు అద్దెకు ఇచ్చే గదుల్లో సీక్రెట్ కెమెరాలు పెట్టే యజమానులు కూడా ఉన్నారు. బెడ్ రూమ్, బాత్రూంలలో రహస్యంగా కెమెరాలు పెట్టి వారి ప్రైవేట్ వీడియోలను రికార్డ్ చేస్తున్నారు. తాజాగా హైదరాబాద్ లో ఇలాంటి సంఘటనే చోటు చేసుకుంది. యూసఫ్ గూడలోని వెంకటగిరి కాలనీలో ఉంటున్న సయ్యద్ సలీమ్ అనే ఇంటి యజమాని ఈ నీచానికి పాల్పడ్డాడు.
అస్సాం రాష్ట్రానికి చెందిన 20 ఏళ్ల యువతి తన సోదరుడు, స్నేహితురాలితో కలిసి రెండు నెలల క్రితం సయ్యద్ సలీం ఇంట్లో అద్దెకు దిగింది. యువతులపై కన్నేసిన సయ్యద్ సలీం.. వారికి అనుమానం రాకుండా రహస్య కెమెరాలను ఏర్పాటు చేశాడు. సెపరేట్ విద్యుత్ మీటర్ పెడుతున్నానని చెప్పి.. ఒక బాక్సుని యువతులు ఉంటున్న గదిలో అమర్చాడు. అయితే ఆ బాక్స్ లో సీక్రెట్ కెమెరా, డిజిటల్ వీడియో రికార్డర్ ని అమర్చిన సయ్యద్ సలీం.. ఆ కెమెరాలను వైర్ల ద్వారా తన గదిలోని కంప్యూటర్, ఫోన్ కి కనెక్ట్ చేసుకున్నాడు. యువతులు బయటకు వెళ్లి ఇంటికి రాగానే రహస్య కెమెరాల ద్వారా అమ్మాయిలు ఏం చేస్తున్నారో అని సయ్యద్ చూసేవాడు.
వారు దుస్తులు మార్చుకుంటున్న దృశ్యాలను చూసి ఆనందించేవాడు. అయితే ఒకరోజు అనుమానం వచ్చి సయ్యద్ ఏర్పాటు చేసిన బాక్స్ ని చూసి అందులో కెమెరా ఉండడంతో యువతులు షాకయ్యారు. కెమెరా నుంచి వైరు ఇంటి యజమాని గదిలోకి వెళ్లడం గమనించిన యువతులు జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సయ్యద్ సలీంను పోలీసులు అదుపులోకి తీసుకుని.. నిందితుడి నుంచి సెల్ ఫోన్, కెమెరా, డిజిటల్ వీడియో రికార్డర్లను స్వాధీనం చేసుకున్నారు. సయ్యద్ పై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అద్దె ఇళ్ళు, హాస్టల్స్ లో ఉండే అమ్మాయిలు ఇలాంటి ఘటనల పట్ల జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచించారు.