సోషల్ మీడియా వినియోగం పెరిగాక.. కొత్త తరహా మోసాలు కూడా అదే స్థాయిలో పెరుగుతున్నాయి. ఫేస్‌బుక్, ఇన్‌స్ట్రాగ్రామ్ వంటి ప్లాట్‌ఫామ్‌లలో పరిచయాలు పెంచుకోవడం.. కల్లబొల్లి మాటలు చెప్పి దగ్గరవ్వడం.. ఆ తర్వాత అందిన కాడికి దోచుకుని ఉడాయించే వారి సంఖ్య పెరుగుతోంది. ఇది కాక.. ఇక ఫోటోలు, వీడియోల పేరుతో మోసం చేసేవారు మరోరకం. మరికొందరు ఇంకా దిగజారి.. రేప్ చేశావంటూ తప్పుడు కేసులు పెడతాం అని బెదిరించే డబ్బులు గుంజేవారి గురించి వింటున్నాం. ఇక్కడ మరో దరిద్రమైన అంశం ఏంటంటే.. ఇలాంటి కేసుల్లో.. సదరు కిలేడీలకు భర్తల ప్రోత్సాహం లభించడం. తాజాగా ఈ కోవకు చెందిన భారీ మోసం ఒకటి వెలుగులోకి వచ్చింది. యూట్యూబర్స్ అయిన భార్యాభర్తలు.. ఓ వ్యాపారవేత్తను తమ ట్రాప్‌లోకి లాగి.. అతడి మీద రేప్ కేసు పెడతామని బెదిరించి ఏకంగా 80 లక్షలు వసూలు చేశారు. బాధితుడు పోలీసులను ఆశ్రయించడంతో.. ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. ఆ వివరాలు..
సదరు కిలేడీ పేరు నమ్రా ఖాదిర్. గురుగావ్‌లో నివాసం ఉంటుంది. యూట్యూబ్‌లో ఇమె చాలా ఫేమస్. ఆమె యూట్యూబ్ చానెల్‌కి సుమారు 6 లక్షల మంది ఫాలోవర్లు ఉండగా.. ఇన్‌స్టాగ్రామ్‌లో 2 లక్షలకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. నమ్రా ఖాదీర్.. తన భర్త విరాట్ బేనీవాల్‌తో కలిసి వీడియోలు, ఫన్నీ రీల్స్ చేసి.. సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేస్తుంటారు. ఈ క్రమంలో కొన్నాళ్ల క్రితం వీరికి బాద్‌షాపూర్‌లో అడ్వర్జయిజింగ్ కంపెనీ నడుపుతున్న దినేశ్ యాదవ్ అనే యువకుడితో పరిచయం ఏర్పడింది.
వారి యూట్యూబ్ చానెల్‌లో తన సంస్థను ప్రమోట్ చేయమని దినేశ్.. నమ్రా ఖాదీర్‌ను కోరాడు. ఈ క్రమంలో వీరు తొలిసారి ఓ హోటల్‌లో కలుసుకున్నారు. ఇక నమ్రా ఖాధీర్ తన యూట్యూబ్ ఛానెల్‌లో దినేశ్ సంస్థను ప్రమోట్ చేయడం కోసం అతడి వద్ద నుంచి 2 లక్షల రూపాయలు తీసుకుంది. ఆ తర్వాత వారి మధ్య పరిచయం క్రమంగా పెరగసాగింది. ఈ క్రమంలో భర్త విరాట్‌ను తన స్నేహితుడిగా దినేశ్‌కు పరిచయం చేసింది నమ్రా.
మరోసారి దినేశ్.. తన సంస్థ కోసం మరో ప్రమోషనల్ వీడియో చేయాల్సిందిగా నమ్రాను కోరాడు. 50 వేల రూపాయలు కూడా ఇచ్చాడు. కానీ నమ్రా.. దినేశ్ చెప్పిన పని చేయలేదు. అతడు నిలదీయడంతో.. కొత్త డ్రామా స్టార్ట్ చేసింది. తనకు దినేశ్ అంటే ఇష్టమని.. అతడిని పెళ్లి చేసుకోవాలని భావిస్తున్నట్లు ఈ సందర్భంగా నమ్రా అతడికి తెలిపింది. అతడిని కలవడం కోసం వీడియోలు లేట్‌గా చేస్తున్నాని చెప్పింది. నమ్రా మాటలు నమ్మిన దినేశ్.. ఆమెతో తిరగడం ప్రారంభించాడు.
ఈ క్రమంలో నమ్రా, దినేశ్ తరచు హోటల్స్‌కి వెళ్లడం.. మద్యం సేవించి ఎంజాయ్ చేయడం చేసేవారు. ఈ క్రమంలో కొన్ని రోజుల క్రితం నమ్రా, దినేశ్.. ఓ క్లబ్‌లో పార్టీకి వెళ్లారు. రాత్రి లేట్ కావడంతో.. అక్కడే రూమ్ బుక్ చేసుకుని ఉన్నారు. మరుసటి రోజు నిద్ర లేచేసరికి.. ఆ రూమ్‌లో విరాట్ కూడా ఉన్నాడు. అప్పుడు నమ్రా తన అసలు స్వరూపం బయటపెట్టింది. తాను, విరాట్ భర్యాభర్తలం అని చెప్పింది. అంతేకాక దినేశ్ బ్యాంక్ కార్డులు, వాచ్ ఇవ్వాలని నమ్రా అతడిని డిమాండ్ చేసింది. లేకపోతే.. అతడి మీద రేప్ కేసు పెడతానని బెదిరించింది. భయపడిన దినేశ్.. వారు అడిగినవన్ని ఇచ్చాడు. అలా గత నాలుగు నెలలుగా నమ్రా.. దినేశ్ వద్ద నుంచి సుమారు 80 లక్షల వరకు కాజేసింది.
చివరకు తన అకౌంట్‌లో డబ్బులు అయిపోయాయని.. ఇక ఇవ్వడానికి తన దగ్గర ఏం లేవని దినేశ్.. నమ్రా దంపతులకు చెప్పాడు. అప్పుడు వారు.. దినేశ్ తండ్రి అకౌంట్ నుంచి తమకు 5 లక్షల రూపాయలు ఇవ్వాలని లేదంటే.. కేసు పెడతామని బెదిరించారు. చేసేదేంలేక.. తండ్రి అకౌంట్ నుంచి డబ్బులు డ్రా చేసి వారికి ఇచ్చాడు దినేశ్. తర్వాత జరిగిన సంగతి తండ్రికి చెప్పాడు. ఆయన పోలీసులకు ఫిర్యాదు చేయమని చెప్పడంతో.. నమ్రా దంపతుల మీద ఫిర్యాదు చేశాడు. ప్రస్తుతం నమ్రా పోలీసు కస్టడిలో ఉండగా.. విరాట్ పరారీలో ఉన్నాడు. పోలీసులు అతడి కోసం గాలిస్తున్నారు.