తూర్పుగోదావరి జిల్లా ఆలమూరు మండలం జిల్లెలపేటలో ఎస్‌ఈబీ పోలీసులపై సారా వ్యాపారులు దాడికి దిగారు. ఈ దాడిలో ఓ ఎక్సైజ్ కానిస్టేబుల్ కు తీవ్రగాయాలయ్యాయి. జిల్లెలపేట వద్ద గోదావరిలో పడవపై సారా తరలిస్తున్నట్లు సమాచారమందుకుని.. ఉన్నతాధికారుల ఆదేశాలతో రాజోలు ఎస్ఈబి ఎస్ఐ రఘు, కానిస్టేబుళ్లు నానాజీ, వాసంశెట్టి శ్రీనివాసుడు దాడులు జరిపారు. ఆ క్రమంలో సారా వ్యాపారం చేస్తున్న ఆరుగురు వ్యక్తులు.. రాజోలు ఎస్ఈబీ పోలీసులపై ప్రతి దాడులు జరిపారు.
ఆ దాడిలో ఎస్ఈబీ కానిస్టేబుల్ వాసంశెట్టి శ్రీనివాసులుకు తీవ్ర గాయాలయ్యాయి. కానిస్టేబుల్ శ్రీనివాసులుని ఆలమూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. దాడి జరిగిన విషయాన్ని తెలుసుకున్న అమలాపురం ఎస్‌ఈబీ డీఎస్పీ శ్రీనివాస్ సంఘటన స్థలాన్ని పర్యవేక్షించారు. ఆలమూరు ఎస్‌ఐ శివప్రసాద్, మండపేట రూరల్ సీఐ శివగణేష్ ఆసుపత్రికి హుటాహుటిన చేరుకుని ఎస్ఈబీ కానిస్టేబుల్ వాసంశెట్టి శ్రీనివాసుడు నుండి వాంగ్మూలం తీసుకున్నారు. మొత్తం ఆరుగురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ, సీఐ తెలిపారు.