సైబర్ నేరాలు విపరీతంగా పెరుగుతున్నాయి. జనాలను మోసం చేయడానికి ఉన్న ఏ ఒక్క మార్గాన్ని వదలడం లేదు కేటుగాళ్లు. ఇక తాజాగా ఓ సైబర్ కేటుగాడు.. వినూత్న పద్దతిలో ఓ జర్నలిస్ట్‌ను మోసం చేశాడు. ఆ వివరాలు..
మాటలతో మాయ చేసి మోసాలకు పాల్పడేవారు మన చుట్టూ ఎందరో ఉన్నారు. మన పట్ల ఎంతో సానుభూతి, ప్రేమ ఉన్నట్లు నటిస్తూ.. కల్లబొల్లి కబుర్లు చెప్పి.. నిండా ముంచే వారి గురించి చాలా సార్లు విన్నాం. కానీ ఇప్పుడు మీరు చదవబోయేది అందుకు పూర్తి వ్యతిరేకం. ఇక్కడ సదరు వ్యక్తి.. కేవలం ఫోన్‌లో మాట్లాడి మాయ చేసి.. భారీగా డబ్బులు కాజేశాడు. అతడి మాటల ప్రభావం నుంచి బయటపడిన తర్వాత.. అసలేం జరిగిందో బాధితుడికి అర్థం కాలేదు. అకౌంట్ చెక్ చేస్తే.. భారీ మొత్తంలో నగదు మాయం. ఏం చేయాలో అర్థం కాక పోలీసులును ఆశ్రయించాడు. బాధితుడు చెప్పిన వివరాలు విని పోలీసులు కూడా ఆశ్చర్యపోయారు. అసలు ఫోన్‌లో హిప్నాటిజం ఏంటి.. ఏం జరిగిందో పూర్తిగా తెలియాలంటే..
ఈ విచిత్ర సంఘటన దేశరాజధాని న్యూఢిల్లీలో చోటు చేసుకుంది. రమేష్ కుమార్ రాజా అనే ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌ను సైబర్ కేటుగాళ్లు.. ఫోన్‌లో మాట్లాడుతూనే హిప్నాటైజ్ చేసి 40 వేల రూపాయలు కొట్టేశారు. దాంతో అతడు పోలీసులను ఆశ్రయించాడు. రమేష్ కుమార్ మాట్లాడుతూ.. ‘‘మార్చి 7న ఓ వ్యక్తి నాకు కాల్ చేసి.. నేను తనకు బాగా పరిచయం ఉన్నట్లు మాట్లాడాడు. తను నా పాత స్నేహితుడిని అని నమ్మించాడు. అతడితో మాట్లాడుతుండగానే.. నేను విచక్షణ కోల్పోయాను. ఏం జరుగుతుందో ఆలోచించే పరిస్థితిలో లేను. ఆ వ్యక్తి అలా నన్ను మాటల్లో పెట్టి.. పేటీఎం ద్వారా.. 20 వేల రూపాయల చొప్పున రెండు సార్లు.. నా అకౌంట్ నుంచి ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నాడు.’’ అని తెలిపాడు.
‘‘ముందుగా అతడు మాట్లాడుతుండగా నాకు ఏం అర్థం కాలేదు. తను ఎవరో నేను గుర్తు పట్టలేదు. అదే విషయం తనను అడిగితే.. నన్ను మర్చిపోయావా.. గుర్తుకు తెచ్చుకో అన్నాడు. అతడి వాయిస్.. నాకు తెలిసిన డాక్టర్ వాయిస్‌లా అనిపించింది. అదే విషయం చెబితే.. ఇప్పుడు గుర్తు పట్టావా అని మొదలు పెట్టి.. నా కుటుంబం, ఆరోగ్యం గురించి చాలా సేపు ప్రశ్నలు అడిగాడు. నేను తనకు ఎన్నో ఏళ్లుగా తెలుసు అన్నట్లు ఎంతో నమ్మకంగా, స్నేహభావంతో మాట్లాడుతుండటంతో నాకు అతడి మీద ఏమాత్రం డౌట్ రాలేదు. అసలు ఆ ఆలోచనే నాకు రాలేదు’’ అని చెప్పుకొచ్చాడు.
‘‘తనతో మాట్లాడే సమయంలో నేను నా ఆలోచనా శక్తి కోల్పోయాను. తన సూచనలు పాటించడం ప్రారంభించాను. ఇంతలో ఆ వ్యక్తి.. తాను వేరే వాళ్లకి డబ్బులు ఇవ్వాలని.. అతడి ఆన్‌లైన్ పేమెంట్ యాప్స్ పని చేయడం లేదని తెలిపాడు. నా అకౌంట్‌కు డబ్బులు పంపి.. సాయంత్రం ఇంటికి వచ్చి తీసుకుంటాను అన్నాడు. అసలు అతడు ఏం చెప్తున్నాడో నాకు అర్థం కాలేదు. నాకు డబ్బులు పంపడం ఎందుకు.. ఏటీఎం నుంచి డ్రా చేసి ఇవ్వొచ్చు కదా అనే అనుమానం కూడా రాలేదు’’ అని గుర్తు చేసుకున్నాడు.
‘‘ఆ తర్వాత అతడు నా అకౌంట్ పనిచేస్తుందో లేదో చెక్ చేస్తానని చెప్పి 2 రూపాయలు పేటీఎమ్‌లో పంపాడు. చెక్ చేయడం కోసం నేను పేటీఎం లింక్ చేసిన ఎస్బీఐ ఖాతా ఒపెన్ చేసి చూడగా.. దాని నుంచి 2 రూపాయలు కట్ అయినట్లు గ్రహించాను. అదే విషయం తనతో చెప్పాను. ఆ తర్వాత మరో మెసేజ్ పంపడంతో దానిపై క్లిక్ చేసి నా పిన్ ఎంటర్ చేశాను. ఈసారి నాకు రూ. 4 వచ్చింది. ఆ విషయం చెప్పిన తర్వాత అతడు నా అకౌంట్‌కి రూ. 20,000 పంపుతున్నట్టు మెసేజ్ పంపాడు. నేను నా అకౌంట్‌ని చెక్ చేయగా.. నా ఖాతా నుంచి రూ. 20,000 డెబిట్ అయ్యాయి. అనుమానం కొద్ది మరోసారి చెక్ చేయగా.. మరో 20 వేలు మొత్తం రూ.40 వేలు ఇలాగే కట్ అయ్యాయి’’ అని వాపోయాడు రమేష్.
అయితే ఈ విషయం విని పోలీసులు ఆశ్చర్యపోతే.. హిప్నాటిజంలో అనుభవం ఉన్న వాళ్లు మాత్రం.. ఇలా మొబైల్‌లో మాట్లాడుతూ.. హిప్నాటిజం చేయడం జరగని పని. కాకపోతే ఇక్కడ బాధితుడిని హిప్నాసిస్ లాంటి ట్రాన్స్ స్టేజ్‌కు తీసుకెళ్లి.. ఈ పనులు చేయించి ఉండవచ్చు అని అంటున్నారు. పోలీసులు రమేష్‌ను మోసం చేసిన బాధితుడుని పట్టుకునే ప్రయత్నంలో ఉన్నారు. మరి ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.