దేశంలో ఆడవాళ్లపై దారుణాలు పెచ్చుమీరి విలయతాండవం చేస్తున్నాయి. నిత్యం ఎక్కడో ఓ చోట దారుణం జరుగుతూనే ఉంది. విచ్చల విడిగా మహిళల హత్యలు చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా ప్రేమ విషయంలో దారుణాలు పెరిగిపోయాయి.
ఢిల్లీకి చెందిన శ్రద్ధా వాకర్ హత్య కేసు దేశ వ్యాప్తంగా ఎంతటి కలకలాన్ని సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పెళ్లి చేసుకోమని బలవంతం చేయటంతో ప్రియుడు ఆమెను దారుణంగా హత్య చేశాడు. అనంతరం శరీరాన్ని ముక్కులుగా చేసి ఫ్రిజ్లో దాచాడు. తర్వాతి ఒక్కొక్క భాగాన్ని ఊర్లోని పలు చోట్ల పడేశాడు. ఈ సంఘటన జరిగి దాదాపు మూడు నెలలు పైనే అవుతోంది. ఈ మూడు నెలల కాలంలో ఇలాంటి సంఘటనలు చాలా జరిగాయి. ప్రియుడి చేతిలో చాలా మంది అమాయక అమ్మాయిలు బలయ్యారు. తాజాగా, కూడా ఓ దారుణ సంఘటన వెలుగులోకి వచ్చింది. పెళ్లికి బలవంతం చేసిన ప్రియురాలిని ఆమె ప్రియుడు దారుణంగా హత్య చేశాడు. తర్వాత ఆమె శవాన్ని తన సొంత డాబాలోని ఫ్రీజర్‌లో ఉంచాడు. అదే రోజు మరో యువతి మెడలో తాళి కట్టాడు. చివరకు పాపం పండి జైలుపాలయ్యాడు. ఈ సంఘటన ఢిల్లీలో ఆలస్యంగా వెలుగుచూసింది.
24 ఏళ్ల సాహిల్ గెహ్లాట్‌ది ఢిల్లీలోని మిట్రాన్ గ్రామం. ఇతడికి హార్యానాలోని జజ్జర్‌కు చెందిన నిక్కితో 2018లో పరిచయం ఏర్పడింది. ఇద్దరూ ఢిల్లీలో కాంపిటీటివ్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్న సమయంలో కలుసుకున్నారు. ఉత్తమ్ నగర్‌లో ఒకే చోట కలిసి కోచింగ్ తీసుకునేవారు. ఆనతి కాలంలో వీరిద్దరి మధ్యా పరిచయం కాస్తా ప్రేమగా మారింది. ఇద్దరు గ్రేటర్ నోయిడాలోని ఓ కాలేజ్ అడ్మిషన్ తీసుకుని చదువుతున్నారు. అక్కడే ఓ అద్దె గదిలో సహజీవనం చేస్తున్నారు. కరోనా సమయంలో ఇద్దరూ ఎవరి ఇళ్లకు వారు వెళ్లిపోయారు. లాక్‌డౌన్ ఎత్తేసిన తర్వాత మళ్లీ ఢిల్లీకి వచ్చి సహజీవనం చేయటం మొదలుపెట్టారు. ఈ సారి ద్వారకా ఏరియాలో రూము తీసుకున్నారు.
నిక్కీతో రిలేషన్‌లో ఉన్న సంగతి సాహిల్ తన కుటుంబసభ్యులకు చెప్పలేదు. దీంతో సాహిల్ ఫ్యామిలీ త్వరగా పెళ్లి చేసుకోమని అతడిపై ఒత్తిడి తీసుకురాసాగింది. తల్లిదండ్రుల మాట కాదనలేక వేరే అమ్మాయితో పెళ్లికి అతడు ఒప్పుకున్నాడు. నిశ్చితార్థం అయిపోయింది. పెళ్లి పత్రిక కూడా ముద్రించారు. ఫిబ్రవరి 10న పెళ్లికి ముహూర్తం కుదిరింది. ఈ విషయం నిక్కీకి తెలిసింది. ఫిబ్రవరి 9తేదీ అతడ్ని నిలదీసింది. అర్థరాత్రి ఇద్దరూ సాహిల్ కారులో ప్రయాణిస్తున్న సమయంలో గొడవ మొదలైంది. దీంతో ఆగ్రహానికి గురైన సాహిల్ ఛార్జింగ్ కేబుల్‌తో నిక్కీ గొంతు బిగించి చంపాడు. తర్వాత ఆమె శవాన్ని తన డాబాకు తీసుకెళ్లాడు. అక్కడి ఫ్రీజర్‌లో ఆమె మృతదేహాన్ని ఉంచాడు.
ప్రియురాలిని చంపిన తర్వాత ఫిబ్రవరి 10న సాహిల్ వేరే అమ్మాయి మెడలో తాళి కట్టాడు. తమ కూతురు కనిపించకపోవటంతో నిక్కీ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వారికి సాహిల్ మీద అనుమానం వచ్చింది. దీంతో అతడ్ని అదుపులోకి తీసుకుని విచారించారు. విచారణలో అతడు ఆ హత్య చేసినట్లు తేలింది. పోలీసులు అతడ్ని అరెస్ట్ చేశారు. తర్వాత నిక్కీ మృతదేహాన్ని సంఘటనా స్థలంనుంచి పోస్టుమార్టం కోసం తరలించారు. ఫిబ్రవరి 14 ప్రేమికుల రోజున ఈ దారుణం వెలుగు చూడటం గమనార్హం.