ఈ మద్య కొంతమంది పనిచేసే చోట చేతివాటం చూపిస్తూ అక్రమంగా డబ్బు సంపాదిస్తున్నారు. పాపం ఎప్పటికీ దాగి ఉండదు అన్న చందంగా ఇలాంటి దందాలకు పాల్పపడే వారు పోలీసులకు పట్టుపడుతూ ఊచలు లెక్కబెడుతున్నారు.
ఈ మద్య సొంత ఇంటికే కన్నం వేసేవాళ్లు ఎక్కువ అయ్యారు. కాణిపాకం వరసిద్ది వినాయక ఆలయంలోని పోటు, గిడ్డంగి, అన్నదాన సత్రంలో ఇటీవల సిబ్బంది చేతివాటం ఎక్కువ అవుతున్నట్టు అధికారులకు ఫిర్యాదు అందాయి. దీంతో ఈవో వెంకటేశు ఆధ్వర్యంలో ఆలయ సిబ్బంది ఇంట్లో సోదాలు నిర్వహించారు. ఈ క్రమంలో ఓ అర్చకుడి ఇంట్లో జింక చర్మం చూసి అధికారుల షాక్ అయ్యారు. వివరాల్లోకి వెళితే..
ఇటీవల కాణిపాకం వరసిద్ది వినాయక ఆలయంలో కొంతమంది సిబ్బంది చేతివాటం ప్రదర్శిస్తున్నట్లుగా అధికారులకు ఫిర్యాదులు అందాయి. దీంతో రంగంలోకి దిగిన ఈవో అన్నదానం భవనం వద్ద రహస్యంగా కాపు కాసి గిడ్డంగి నుంచి సరుకులు తరలిస్తున్న బైక్ ను వెంబడించి వంటమనిషి ఇంటికి వెళ్లి పరిశీలించారు. అక్కడ పెద్దఎత్తున బియ్యం బస్తాలు, చెక్కర, ఇతర సామాగ్రిని గుర్తించారు. అలాగే మిగిలిన సిబ్బంది నివాసాల్లో తనిఖీలు చేయగా మొత్తం రూ.1.30 లక్షల విలువైన సరుకులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఆలయంలో పనిచేస్తూ అక్రమాలకు పాల్పడిన ఏడుగురిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఈవో చెప్పారు.
ఇదిలా ఉంటే.. కాణిపాకం వరసిద్ది వినాయకస్వామి అనుబంధ ఆలయం అయిన వరదరాజుల స్వామి ఆలయ అర్చకుడు కృష్ణ మోహన్ నివాసంలో సోదాలు నిర్వహించిన అధికారులు జింక చర్మాన్ని గుర్తించారు. ఈ విషయాన్ని వెంటనే అటవీ అధికారులకు సమాచారం అందించారు. మొదటి తనకు ఏ విషయం తెలియదని బుకాయించిన కృష్ణ స్వామి చివరికి ఓ వ్యక్తి ద్వారా దాన్ని కొనుగోలు చేసినట్లు ఒప్పుకున్నాడు. తర్వాత డీఎఫ్ వో చైతర్య కుమార్ రెడ్డి ఆదేశాలతో జింక చర్మాన్ని స్వాధీనం చేసుకున్నారు అటవీ అధికారులు. కృష్ణ మోహన్ న అధీనంలోకి తీసుకొని జింక చర్మం అమ్మిన వ్యక్తి కోసం గాలింపు చర్యలు మొదలు పెట్టారు.