అమ్మాయిల వీక్ నెస్ ఉన్న పురుషులను తమ వలలో వేసుకుంటున్నారు. అవసరం,అండ దండ లేని మగవాళ్లను టార్గెట్ చేస్తున్నారు. ప్రేమ, పెళ్లి పేరుతో మభ్య పెట్టి అందిన కాడికి దోచుకుంటున్నారు. కొన్ని రోజులు పాటు కాపురం చేశాక.. ఇంట్లో ఉన్న నగలు, డబ్బు మూటకట్టుకుని ఉడాయిస్తున్నారు
దేశంలో మాయగాళ్లకే కాదూ కిలేడీలకు కూడా కొదవ ఉండటం లేదు. జల్సాలు, విందు, వినోదాలు, ఈజీ మనీ కోసం యువతులు మోసాలకు తెరలేపుతున్నారు. అమ్మాయిల వీక్ నెస్ ఉన్న పురుషులను తమ వలలో వేసుకుంటున్నారు. అవసరం,అండ దండ లేని మగవాళ్లను టార్గెట్ చేస్తున్నారు. ప్రేమ, పెళ్లి పేరుతో మభ్య పెట్టి అందిన కాడికి దోచుకుంటున్నారు. కొన్ని రోజులు పాటు కాపురం చేశాక.. ఇంట్లో ఉన్న నగలు, డబ్బు మూటకట్టుకుని ఉడాయిస్తున్నారు. మరో ప్రాంతంలో మరో బకరా కోసం స్కెచ్ వేస్తున్నారు. ఆడ పిల్లల చేతిలో మోసపోయామని చెబితే.. పరువు పోతుందన్న బాధతో కిమ్మనకుండా ఉండిపోతున్నారు కొంత మంది పురుషులు. దీంతో మాయ లేడీల ఆటలకు అడ్డులేకుండా పోయింది.
పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీ చెందిన రేవంత్ కూడా ఇలాంటి బాధితుడే. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అన్నపూర్ణ కాలనీకి చెందిన రేవంత్ పాన్ షాప్ నిర్వహిస్తూ బతుకుతున్నాడు. ఇతడికి తొలుత పెళ్లై.. విడాకులయ్యాయి. రెండో పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. ఈ నేపథ్యంలో షాదీ డాట్ కామ్ యాప్‌ను ఆశ్రయించాడు. ఈ క్రమంలో వరంగల్ జిల్లాకు చెందిన ఓ యువతితో అతడికి పరిచయం ఏర్పడింది. తర్వాత ఫోన్లో ముచ్చట్లు ప్రారంభించారు. తనకు ఇదే మొదటి పెళ్లని, వరుడి కోసం ఎదురు చూస్తున్నట్లు పేర్కొంది. తరచూ ఫోన్లు మాట్లాడుకోవడంతో ఆమెపై ఇష్టం ఏర్పడి.. పెళ్లి చేసుకోవాలని భావించాడు. ఇరు కుటుంబ సభ్యులకు చెప్పడంతో వారూ అంగీకరించారు. ఎన్టీపీసీలోని చిలుకలయ్య ఆలయంలో నిరాడంబరంగా పెళ్లి చేసుకుని కొత్త కాపురం పెట్టారు.
పెళ్లైన కొన్ని రోజులకే అమ్మడి అసలు స్వరూపం బయట పడింది. తనకు మందు, సిగరెట్లు కావాలంటూ అతడిని వేధించడం మొదలు పెట్టింది. దీంతో ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. అయితే తన అక్క ఇంటి వద్దకు వెళ్లి వస్తానని 70వేల నగదు, 4 తులాల బంగారంతో వెళ్లిన మహిళ.. ఎంతకూ తిరిగి రాకపోవడంతో రేవంత్‌కు అనుమానం మొదలైంది. తీగ లాగితే డొంక కదిలినట్లుగా.. ఆమె వ్యవహారం ఒక్కొక్కటిగా బయటకు వచ్చింది. ఆమెకు గతంలో మూడు పెళ్లిళ్లు అయ్యాయని, చాలా మందితో పరిచయాలు ఉన్నట్లు తేలింది. చివరకు ఆమె ఎక్కడుందో తెలుసుకుని వెళ్లేసరికి.. భార్య తన స్నేహితులతో విలాసాల్లో మునిగి తేలుతూ కనిపించింది.
అతడిని చూసి షాక్ తిన్న యువతి.. అక్కడ ఉన్నవారితో రేవంత్‌పై దాడి చేయించి, వీడియో తీసింది. పోలీసులకు చెబితే వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేస్తామంటూ బెదిరించారు. అతడి కుటుంబ సభ్యులను కూడా డబ్బుల కోసం వేధించడం మొదలు పెట్టారు. దీంతో రేవంత్ ఎన్టీపీసీ పోలీసులు ఆశ్రయించాడు. తనకు న్యాయం చేయాలని వేడుకున్నాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. యువతి కోసం గాలిస్తున్నారు.