రూపాయి వస్తుందంటే చాలు.. మానవ సంబంధాలు కూడా మర్చిపోతున్నారు కొంతమంది . తమ స్వలాభం కోసం అమాయకులను నట్టేట ముంచుతున్నారు. నమ్మకమే పెట్టుబడి అన్న సామెతను అన్వయించుకుని భారీ మోసాలకు పాల్పడుతున్నారు కేటుగాళ్లు.
డబ్బే ధ్యేయంగా బతుకుతున్నారు నేటి మనుషులు. తేలికగా డబ్బు సంపాదించడం ఎలా అనే అంశంపై దృష్టి సారిస్తున్నారు. దాని కోసం అడ్డదారులు వెతుకుతున్నారు. డబ్బు కోసం ఎంతటి నీచమైన పని చేయడానికి కూడా వెనుకాడటం లేదు. రూపాయి వస్తుందంటే చాలు.. మానవ సంబంధాలు కూడా మర్చిపోతున్నారు. తమ స్వలాభం కోసం అమాయకులను నట్టేట ముంచుతున్నారు. నమ్మకమే పెట్టుబడి అన్న సామెతను అన్వయించుకుని భారీ మోసాలకు పాల్పడుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో నయా దందాకు తెరలేపారు మోసగాళ్లు. దొంగ నోట్లను చలామణి చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు.
ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో దొంగ నోట్ల చలామణి కలకలం రేపుతోంది. తాజాగా మరో ఘటన కొమరం భీం జిల్లాలో చోటుచేసుకుంది. వాంకిడికి చెందిన హివ్రె తిరుపతి అనే వ్యక్తి.. గత కొంతకాలంగా దొంగ నోట్లను సరఫరా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. అమాయకులు, నిరక్ష్యరాసులకు వలవేసి దందాను షురు చేస్తున్నాడు. ఈ విషయం పోలీసులకు చేరగా.. తిరుపతిపై ఫోకస్ పెంచారు. ఈ క్రమంలో తిరుపతి.. దొంగనోట్లు తరలిస్తుండగా అతడి ఇంట్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. అతడి వద్ద రూ.21.30 లక్షల విలువైన రూ. 500 నకిలీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అరెస్టు చేసి విచారణ చేపట్టగా విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. అతడు భారీ మోసానికి సూత్రధారిగా తేలింది.
రూ.లక్ష ఒరిజినల్ నోట్లకు రూ.3 లక్షల దొంగ నోట్లను కట్టబెట్టేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకున్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది.కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని అమాయక ఆదివాసీలను లక్ష్యంగా చేసుకుని ఈ ఘరానా మోసానికి పాల్పడుతున్నట్లు వెల్లడైంది. కాగా, అతడు తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్రకు చెందిన వ్యక్తులతో కూడా డీలింగ్ చేసినట్లు తెలుస్తోంది. 15 రోజుల క్రితమే దొంగనోట్ల ఒప్పందం కుదుర్చుకున్నట్లు విచారణలో వెల్లడైంది. రూ.10 లక్షల అసలైన నోట్లకు రూ.30 లక్షల దొంగనోట్లు అతడి వద్ద తీసుకోవడానికి తిరుపతి అంగీకరించాడు. అనుమానం రాకుండా నకిలీ కట్టల్లో పైన కింద అసలు నోట్లను ఉంచిన వ్యక్తి.. వాటిని మార్కెట్‌లో చెలామణి చేయాలని సూచించాడు.
ఆ క్రమంలోనే ఆ వ్యక్తి రూ. 21.30 లక్షల నకిలీ నోట్లను ఇచ్చినట్లు తేలింది. పైన, అడుగున అసలైన రూ.500 నోట్లు ఉండగా.. మిగిలినవి కలర్ జిరాక్సులుగా పోలీసులు గుర్తించారు. అయితే తిరుపతికి ఆ దొంగనోట్లు ఇచ్చింది ఎవరో తెలియాల్సి ఉంది. అలాగే ఈ కలర్ జిరాక్సు నోట్లను ఎక్కడ ప్రింట్ చేస్తున్నారని తెలియరాలేదు. ఈ దందాలో ఎంత మంది ఉన్నారో అని విచారణ చేస్తున్నామని పోలీసుల వెల్లడించారు. అలాగే దొంగ నోట్లు పట్ల జాగ్రత్త వహించాలని, దొంగనోట్లను ఎవరైనా గుర్తించినట్లయితే పోలీసులకు సమాచారం అందించాలని ప్రజలకు పోలీసులు సూచించారు.