ఇతని పేరు మౌలాలీ. వయసు 47 ఏళ్లు. స్థానికంగా ఉండే ఓ ఒంటరి మహిళతో కొన్నాళ్ల పాటు సహజీవనం చేశాడు. ఆ తర్వాత ఆమెను, ఆమె తల్లిని దారుణంగా హత్య చేశాడు. అంతేకాకుండా తన ప్రియురాలి కూతురిపై అత్యాచారం కూడా చేశాడు. ఈ దారుణ ఘటనపై తాజాగా న్యాయస్థానం ఊహించిన శిక్ష విధించింది.
ఏపీలోని చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె మండలంలోని గంగిరెడ్డి కాలనీ. ఇక్కడే సయ్యాద్ మౌలాలీ ( 47) అనే వ్యక్తి నివాసం ఉండేవాడు. ఇతడు స్థానికంగా ఉండే చెరువులను లీజుకు తీసుకుని జీవనాన్నికొనసాగించేవాడు. అయితే ఈ క్రమంలోనే ఇతడికి సరళమ్మ (97) అనే ఒంటరి మహిళతో పరిచయం ఏర్పడింది. ఆమెకు ముగ్గురు కూతుళ్లు. ఈ పరిచయం కాస్త.. సరళమ్మ, మౌలాలీ మధ్య వివాహేతర సంబంధానికి దారి తీసింది. అలా మౌలాలి తరుచు సరళమ్మ ఇంటికి వెళ్తూ ఆమెతో సహజీవనం చేసేవాడు.
ఇదిలా ఉంటే.. సరళమ్మకు పరాయి మగాళ్లతో పరిచయాలు ఉన్నాయని మౌలాలీ అనుమానించాడు. అయితే ఇదే విషయమై సరళమ్మతో మౌలాలీ గొడవ పడ్డాడు. ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగింది. ఇక కోపంతో ఊగిపోయిన మౌలాలీ.. సరళమ్మను దారుణంగా హత్య చేశాడు. అనంతరం ఆమె శవాన్ని రాళ్లకు తాళ్లతో కట్టి ఎవరికీ కనిపించకుండా స్థానికంగా ఉండే ఓ ప్రాజెక్ట్ లో పడేశాడు. ఇక మరసటి రోజు నుంచి సరళమ్మ కనిపించకుండాపోవడంతో మృతురాలి తల్లి మౌలాలీని నిలదీసింది.
ఆమెకు ఏదేదో నచ్చ చెప్పాడు. అదే రాత్రి సరళమ్మ తల్లిని కూడా మౌలాలీ గొంతు పిసికి హత్య చేశాడు. ఆమె శవాన్ని కూడా ఓ చెరువులో ఉన్న ఓ చెట్టుకు తాళ్లతో కట్టాడు. దీంతో సరిపెట్టని ఈ దుర్మార్గుడు.. సరళమ్మ కూతురిపై కన్నేశాడు. బలవంతంగా ఆ బాలికపై అనేకసార్లు అత్యాచారం చేశాడు. ఇక ఇదంతా ఎవరికైన చెబితే చంపేస్తానని కూడా ఆ బాలికను బెదిరించాడు. ఎందుకో మౌలాలీపై సరళమ్మ కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చింది. దీంతో వారంతా మౌలాలీపై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు మౌలాలీని అదుపులోకి తీసుకుని విచారించగా.. ఇక ఈ దారుణ ఘటనపై మహిళా న్యాయస్థానం సోమవారం తీర్పును ఇస్తూ.. నిందితుడు మౌలాలీ మరణించేంత వరకు జైలులోనే ఉండేలా శిక్ష విధిస్తూ నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా అతనికి రూ. 10 వేల జరిమానా విధిస్తూ, సరళమ్మ కూతురికి రూ.5 లక్షల నష్టపరిహారం అందించాలని న్యాయస్థానం కలెక్టర్ కు ఆదేశాలు జారీ చేసింది. న్యాయస్థానం తీర్పుతో మృతురాలి కుటుంబ సభ్యులు, బంధువులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇంతటి దారుణానికి పాల్పడిన ఈ దుర్మార్గుడి దారుణంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.