ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యపై అనుమానం పెంచుకున్న ఆ భర్త.. ఆమె కలలో కూడా ఊహించని నీచమైన దారుణానికి పాల్పడ్డాడు. భార్య నగ్న చిత్రాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి వాటికి రేటు కట్టాడు. అంతటితో ఆగక ఏకంగా..
ఆమె అతడిని ప్రాణంగా ప్రేమించింది. సామాజిక వర్గాలు వేరు అని పెద్దలు ఒప్పుకోకపోయినా సరే.. వారిని కాదనుకుని మరీ ప్రేమించిన వాడి కోసం ఇంటి నుంచి బయటకు వచ్చేసింది. పెళ్లి చేసుకున్నారు. ఇద్దరు బిడ్డలు.. ఏడేళ్ల కాపురం సజావుగా సాగింది. కానీ ఏడాది కాలంగా వారి ఇంట్లో ఓ భూతం ప్రవేశించింది. దాంతో భర్త.. కనీసం మనిషిని అనే స్పృహ కూడా మర్చిపోయి.. అత్యంత దారుణమైన పనికి ఒడిగట్టాడు. భార్య నగ్న చిత్రాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి వాటికి రేటు కట్టాడు. అంతటితో ఊరుకోక.. ఏకంగా భార్యను హతం చేశాడు. ఈ దారుణం వివరాలు..
ఈ దారుణ సంఘటన ఆంధ్రప్రదేశ్, ఏలూరు జిల్లా, ముసునూరు మండలం రమణక్కపేటలో గురువారం రాత్రి చోటు చేసుకుంది. ఎన్టీఆర్ జిల్లా తిరువూరుకు చెందిన షేక్ నాగుల్ మీరా మొదటి భార్యతో విడిపోయి ఒంటరిగా ఉంటున్నాడు. ఈ క్రమంలో అతడు తన సోదరి ఉంటున్న రమణక్కపేట గ్రామానికి వచ్చి తాపీ పనులు చేసుకుంటూ జీవించేవాడు. ఈ క్రమంలో అతడికి అదే గ్రామానికి చెందిన గొల్లపల్లి జ్యోత్స్నతో పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారింది.
ఇక వీరిద్దరూ 2015లో ముస్లిం సంప్రదాయం ప్రకారం కులాంతర వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు. ఏడేళ్లుగా వీరి కాపురం సజావుగా సాగింది. అయితే ఏడాది కాలం నుంచి నాగుల్ మీరా భార్య ప్రవర్తనపై అనుమానం పెంచుకున్నాడు. ఆమెతో తరచూ గొడవపడేవాడు. ఈ క్రమంలో కొన్ని రోజుల క్రితం భార్య ఫోన్ తనతో తీసుకెళ్లిన నాగుల్ మీరా.. ఆమె నగ్న ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి.. ఈ అమ్మాయి రేటు ఇంత అంటూ.. జ్యోత్స్న ఫోన్ నంబర్ పోస్ట్ చేశాడు. తర్వాత మొబైల్ తెచ్చి జ్యోత్స్న తల్లికి ఇచ్చి వెళ్లాడు. ఆ తర్వాత నుంచి ఆమెకు కాల్స్ రావడం.. వారు అసభ్యంగా మాట్లాడుతుండటంతో.. గత ఏడాది అక్టోబర్‌లో జ్యోత్స్న ముసునూరు పోలీసులకు ఫిర్యాదు చేసింది.
విషయం తెలుసుకున్న నాగుల్ మీరా.. ఊరి నుంచి పరారయ్యాడు. అంతేకాక జ్యోత్స్నపై కక్ష పెంచుకున్నాడు. ఈ క్రమంలో గురువారం జ్యోత్స్న ఇంటికి వచ్చిన నాగుల్ మీరా.. చెట్టు చాటున దాక్కుని.. అటుగా వస్తోన్న భార్యపై కత్తితో మూడు సార్లు దాడి చేసి అక్కడ నుంచి పరారయ్యాడు. జ్యోత్స్న చిన్న కుమారుడు ఇది గమనించి.. కుటుంబ సభ్యులకు తెలియజేయడంతో.. వారు వెంటనే వచ్చి చూడగా.. అప్పటికే జ్యోత్స్న మృతి చెందింది. ఇక కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు నాగుల్ మీరాపై కేసు నమోదు చేసిన పోలీసులు అతడి కోసం గాలిస్తున్నారు. మరి నాగుల్ మీరా చేసిన దారుణంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.