ఆంధప్రదేశ్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఒక 108 అంబులెన్స్‌లో మంటలు చెలరేగాయి. ఆ తర్వాత ఏం జరిగిందంటే..!
ఆంధ్రప్రదేశ్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. రోగిని తరలిస్తున్న 108 అంబులెన్స్‌లో హఠాత్తుగా మంటలు చెలరేగాయి. ఆ వాహనంలోని ఆక్సిజన్ సిలిండర్ పేలింది. పేలుడు ధాటికి వాహన శకలాలు ఎగిరి సమీపంలోని పొగాకు మండెల మీద పడటంతో ఆ నిల్వలు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఈ ఘటనలో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రకాశం జిల్లా, పామూరు మండలంలోని రజాసాహెబ్ పేటలో సోమవారం ఈ ఘటన జరిగింది. రజాసాహెబ్ పేటకు చెందిన పి.ఏసురాజు అనే వ్యక్తి మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్నాడు. దీంతో ఆయన్ను డయాలసిస్ కోసం తీసుకెళ్లేందుకు ఏసురాజు కుటుంబీకులు 108కు ఫోన్ చేశారు. ఏసురాజును ఎక్కించుకుని కొంతదూరం వెళ్లేసరికి.. షార్ట్‌సర్క్యూట్ కారణంగా డ్రైవర్ క్యాబిన్లో మంటలు వ్యాపించాయి.
అంబులెన్స్‌ను నడుపుతున్న తిరుపతిరావు వెంటనే అలర్ట్ అయి బండిని ఆపేశారు. ఈఎంటీ మధుసూదన్‌రెడ్డిని అప్రమత్తం చేయడంతో పాటు.. వాహనంలో ఉన్న రోగి, ఆమె తల్లిని కిందకు దించారు. ఆ కాసేపటికే వాహనం అంతటా మంటలు విస్తరించాయి. వెహికిల్‌లోని ఆక్సిజన్ సిలిండర్ పేలడంతో.. దాని ధాటికి వాహనం శకలాలు ఎగిరి దగ్గర్లోని పొగాకు మండెల మీద పడ్డాయి. దీంతో రూ.40 లక్షలకు పైగా విలువైన పొగాకు పూర్తిగా అగ్నికి ఆహుతైంది. శకలాలు తగిలి సాధినేని వరదయ్య అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ఆయన్ను ఒంగోలుకు తరలించారు. ఘటనా స్థలాన్ని మాజీ ఎమ్మెల్యే ముక్కు ఉగ్రనరసింహారెడ్డి పరిశీలించారు. ఆస్పత్రికి వెళ్లి గాయపడిన వరదయ్యను పరామర్శించారు. తహసీల్దార్ ప్రసాద్, ఎస్సై కే సురేష్ ప్రమాదానికి సంబంధించిన వివరాలలను సేకరించారు.