హైదరాబాద్, ఆదిభట్ల యువతి డాక్టర్ వైశాలి కిడ్నాప్ కేసులో విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. నవీన్ రెడ్డి పక్కా ప్లాన్ ప్రకారమే యువతిని కిడ్నాప్ చేసినట్లు తెలుస్తోంది. ముందుగా నవీన్ రెడ్డీ పార్టీ పేరుతో అందరిని తన ఆఫీస్‌కు పిలిపించుకున్నాడట. అనంతరం వారికి మద్యం ఏర్పాటు చేసి.. మత్తులో ఉన్న వారందరినీ తీసుకొని వైశాలి ఇంటిపై దాడి చేశాడు. సినీ ఫక్కీలో దాదాపు 100 మందితో యువతిని కిడ్నాప్ చేశాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు గంటల వ్యవధిలోనే యువతిని కిడ్నాపర్ల చెర నుంచి విడిపించారు. ఇప్పటికే.. నవీన్ రెడ్డి సహా 32 మందిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు పోలీసులు. తాజాగా, సదరు యువతి వైశాలి మీడియా ముందుకొచ్చి.. ఆ రోజు జరిగిందన్నది వెల్లడించింది.
నవీన్ రెడ్డితో పరిచయం మాత్రమే ఉందని చెప్పిన వైశాలి.. ప్రేమ, పెళ్లి అన్న విషయాలను కొట్టిపారేసింది. కారులో గోళ్లతో గిచ్చారని, కొరికారని ఆమె కన్నీటి పర్యంతమయ్యింది. తన తండ్రిని చంపేస్తానని బెదిరించారని.. ఇష్టం లేదన్నా వినిపించుకోలేదని డాక్టర్ వైశాలి తెలిపారు. “నవీన్ తో నాకు పెళ్ళి కాలేదు. ఫోటోలు కూడా మార్ఫింగే. కిడ్నాప్ చేసి తీసుకెళ్తున్నపుడు హెల్ప్ అని అరుస్తుంటే చాలా అసభ్యంగా ప్రవర్తించారు. గోళ్ళతో గిచ్చారు.. కొరికారు. ఇష్టం లేదని చెప్తున్నా వినిపించుకోలేదు. నీ ఇష్టంతో పని లేదన్నాడు. కారులో నవీన్‌తో పాటు ఆరుగురు ఉన్నారు. ప్లీజ్.. ప్లీజ్ అని వేడుకుంటున్నా కాళ్లు పట్టుకొని లాక్కెళ్లారు”.
“లాక్ డౌన్ సమయంలో నవీన్ మాతో కలిసి బాడ్మింటన్ ఆడేవాడు. అలానే పరిచయం ఏర్పడింది. అంతే.. ప్రేమ లేదు. నేనంటే ఇష్టమని చెప్తే పేరంట్స్‌ను అడగమని చెప్పా. నాకు ప్రపోజ్ చేసినా.. నో చెప్పా. నకిలీ ఇన్‌స్టాగ్రామ్ ఖాతా తెరిచి తన ఫోటోలు మార్ఫింగ్ చేసి వేధించారు. ఈ విషయమై మూడు నెలల క్రితం ఫిర్యాదు కూడా ఇచ్చా. పోలీసులు చర్యలు తీసుకొని ఉంటే నాపై దాడి జరిగి ఉండేది కాదు. నాకు రక్షణ కల్పించాలి..” అని వైశాలి వెల్లడించింది.