అబ్దుల్లాపూర్‌మెట్ నవీన్ హత్య కేసులో ఏ3 ముద్దాయిగా ఉన్న నిహారిక పోలీసులు విచారణలో వెల్లడించిన విషయాలు చూస్తే.. ఈ అమ్మాయి పిచ్చిదా లేక అమాయకురాలా.. నేటి కాలంలో ఆడపిల్లలు నిహారికలా ఉంటే.. ఇక అంతే సంగతులు అనే వాదనలు వినిపిస్తున్నాయి. ఎందుకు అంటే..
అబ్దుల్లాపూర్‌మెట్‌లో బీటెక్ విద్యార్థి నవీన్ దారుణ హత్యతో రెండు తెలుగు రాష్ట్రాలు ఉలిక్కిపడ్డాయి. పట్టుమని 20 ఏళ్లు లేని ఓ కుర్రాడు.. తను ప్రేమించిన అమ్మాయి కోసం.. స్నేహితుడిని నమ్మించి దారుణంగా హత్య చేశాడు. అంతటితో ఆగక.. అతడి శరీరం నుంచి అవయవాలను తొలగించి.. వాటితో సెల్ఫీలు దిగాడు అంటే.. ఆ కుర్రాడిలో క్రూరత్వం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక ఈ దారుణం వెలుగు చూసిన నాటి నుంచి.. హరిహరకృష్ణతో పాటు.. అతడి స్నేహితురాలు నిహారిక మీద అనేక అనుమానాలు, ఆరోపణలు వెలుగు చూశాయి. దానికి తగ్గట్టు నిహారిక కూడా హరి చేసిన దారుణం గురించి తెలిసి.. పోలీసులుకు చెప్పకపోవడం, పైగా అతడు పారిపోవడానికి డబ్బులు సాయం చేయడం చూస్తే.. ఈకేసులో ఆమెది కీలక పాత్ర అని అర్థం అవుతోంది. అయితే ఈ కేసులో ప్రధాన నిందితుడు హరి వెర్షన్ చూస్తే.. ప్రేమించిన అమ్మాయి తనకే దక్కాలి అనే ఓ శాడిజం స్పష్టంగా కనిపిస్తోంది. కానీ నిహారిక మాటలు వింటే.. ఇంత పెద్ద తప్పు చేసిన ఈ అమ్మాయికి అసలు జ్ఞానం, మంచి చెడు విచక్షణ తెలుసా.. అసలు ఆడపిల్లలు ఇంత అమాయకంగా ఉంటే ఎలా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.
ఈ కేసుకు సంబంధించి పోలీసులు నిహారికను ఏ3గా నమోదు చేసి.. చంచల్‌గూడ జైలుకు తరలించారు. ఇక పోలీసుల విచారణలో ఆమె వెల్లడించిన విషయాలు చూస్తే.. ఆశ్చర్యంతో పాటు అయ్యో అనిపిస్తుంది. తాను-నవీన్ ఇంటర్ నుంచే ప్రేమించుకుంటున్నామని.. తన ఇంట్లోనే తరచుగా కలుసుకునేవాళ్లం అని నిహారిక తెలిపింది. ఇంటర్ అంటే జస్ట్ టీనేజ్‌లోకి ఎంట్రీ ఇవ్వడం. ఆ వయసులో సహజంగానే అపోజిట్ సెక్స్ మీద ఆసక్తి కలుగుతుంది. దరిద్రం ఏంటంటే.. ఈ కాలం యువత.. ఆకర్షణనే ప్రేమగా భావిస్తోంది. కానీ తమది లవ్ కాదు అని తెలుసుకునేలోపే జీవితాలు తారుమారు అవుతున్నాయి. ఇక్కడ నిహారిక జీవితంలో కూడా అదే జరిగింది. 16 వ ఏట నవీన్.. తనను లవ్ చేస్తున్నాను అంటే నమ్మింది.. ఏకంగా ఇంటికే తీసుకు వచ్చింది.. అంటే ఆ అమ్మాయి విషయంలో తల్లిదండ్రుల పర్యవేక్షణ ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
కుమార్తె ఏం చేస్తోంది.. ఎవరితో మాట్లాడుతోంది.. ఆమె స్నేహితులు ఎవరు అని తెలుసుకునేంత తీరక కూడా లేకుండా గడుపుతున్నారంటే.. కుమార్తె పట్ల వారికి ఎంత నిర్లక్ష్యం ఉందో అర్థం చేసుకోవచ్చు. అలా ఎందుకు అనుకోవాలి.. బిడ్డ మీద నమ్మకం అనుకోవచ్చు కదా అంటే.. సరే.. తమ బిడ్డ మంచిదే.. కానీ రోజులు బాగాలేవు కదా.. తన బిడ్డతో స్నేహం చేసేవారు ఎలాంటి వారు అనే తెలుసుకోవాల్సిన బాధ్యత మాత్రం తల్లిదండ్రులదే. జరిగిన దారుణంలో నిహారిక తప్పు ఎంత ఉందో.. ఆమెపై పర్యవేక్షణ లేకుండా వదిలేసిన తల్లిదండ్రులది అంతే తప్పు. వాళ్లు ముందే జాగ్రత్త పడితే.. ఈ రోజు నిహారికకు ఈ పరిస్థితి వచ్చేది కాదు.. నవీన్ బలయ్యేవాడు కాదు.
ఇక ఇంటర్‌లోనే ప్రేమలో పడ్డారు, తిరిగారు. విడిపోయారు అంటేనే వారిది కేవలం ఆకర్షణ అని అర్థం అవుతోంది. ఇక నిహారిక-నవీన్‌ల లవ్ గురించి హరిహరకు పూర్తిగా తెలుసు. అతడే తమ ఇద్దరి మధ్య మధ్యవర్తిగా ఉండే వాడని నిహారిక వెల్లడించింది. నిహారిక-నవీన్ విడిపోతే.. ఈ అవకాశాన్ని హరి వినియోగించుకున్నాడు. ముందు నుంచి నిహారిక మనస్తత్వం ఎలాంటిదో తెలుసుకున్న హరి.. అవకాశం దొరగ్గానే.. అంటే నిహారిక, నవీన్‌లు విడిపోగానే దాన్ని తనకు అనుకూలంగా మార్చుకున్నాడు. స్నేహితుడిని ప్రేమించి, విడిపోయిన అమ్మాయికి అండగా ఉండాల్సింది పోయి.. తన మనసులోని దురాలోచనని బయటపెట్టాడు.
నవీన్‌కు దూరం అయిన నిహారిక.. తర్వాత నెమ్మదిగా హరికి దగ్గరయ్యింది. అతడు చెప్పే మాయ మాటలు నమ్మింది. ప్రేమిస్తున్నాను అంటే ఎస్ చెప్పింది. కానీ ఒక్క నిమిషం కూడా తన మాజీ బాయ్‌ఫ్రెండ్ స్నేహితుడినే తాను లవ్ చేయడం ఎంత వరకు కరెక్ట్.. దీని వల్ల భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు వస్తాయనేది ఆలోచించలేదు. వీటన్నింటి కంటే ముందు.. నవీన్‌తో బెడిసికొట్టినప్పుడు అయినా నిహారిక అర్థం చేసుకోవాల్సింది.. ఈ వయసులో కలిగేది కేవలం ఆకర్షణ మాత్రమే.. జరిగింది ఏదో జరిగిపోయింది.. ఇక మీదట అయినా భవిష్యత్తు మీద దృష్టి పెట్టాలనుకుంటే ఆ అమ్మాయి జీవితం మరోలా ఉండేది. కానీ మంచి చెడులు ఆలోచించే పరిజ్ఞానం ఆమెకు ముందు నుంచి లేవు. ఫలితంగానే ఇంతటి దారుణ నేరంలో భాగస్తురాలిగా మారి.. జైల్లో ఊచలు లెక్కబెడతోంది.
ఇక హరి నిహారికకు దగ్గరైన తర్వాత.. మాటల సందర్భంలో నవీన్ మీద తనకున్న కోపాన్ని వ్యక్తం చేశాడు. నవీన్‌ను హత్య చేసి నిహారికను కిడ్నాప్ చేస్తానని అనేవాడని ఆమెనే స్వయంగా తెలిపింది. కనీసం అప్పుడైనా.. హరి మనసులో ఎంతటి క్రూరత్వం దాగుందో నిహారకి పసిగట్టలేదు. కేవలం అతడు జోక్ చేస్తున్నాడు అనుకుంది. నవీన్ హత్య జరిగిన తర్వాత.. అతడి శరీర భాగాలను ఫొటో తీసి పంపితే.. ఏదో ప్రాంక్ అనుకుని.. ఓకే గుడ్ బాయ్ అని రిప్లై ఇచ్చింది. ఇక్కడ ఎక్కడ కూడా నిహారికకు తాను ఎంత పెద్ద తప్పు చేస్తున్నానో అర్థం చేసుకోలేకపోయింది.
పైగా హత్య జరిగిన తర్వాత హరి వచ్చి దారుణం గురించి చెప్పి.. మనం పోలీసులకు దొరకం అంటే అమాయకంగా నమ్మింది. అతడి కలిసి హత్య జరిగిన ప్రాంతానికి వెళ్లి చూసి వచ్చింది.. చివరకు నవీన్ పారిపోవడానికి డబ్బులు కూడా ఇచ్చింది. అంటే నిహారిక పూర్తిగా హరి ట్రాప్‌లో ఉంది. అతడు ఎలా చెప్తే అలా ఆడింది. ఏం చేప్పినా నమ్మింది. కానీ ఒక్క నిమిషం కూడా తాను ఎంత పెద్ద తప్పు చేస్తున్నానో.. ఇది ఎంత పెద్ద నేరమో అన్న ఆలోచన ఆమెకు ఎప్పుడు కలగలేదు.
జరుగుతున్న సంఘటలను అన్ని చూసి ఏదో సినిమాలా భావించింది. వాస్తవంగా పరిస్థితులు ఎంత దారుణంగా ఉంటాయో అంచనా వేయలేక పోయి.. జీవితంలో సరిదిద్దుకోలేని తప్పు చేసింది. ఇప్పుడు కళ్లకున్న పొరలు తొలగిపోయాక.. చూసుకుంటే.. చదువు, కెరీర్, జీవితం అన్ని నాశనం అయ్యి.. జైల్లో ఊచలు లెక్కపెడుతోంది. జరిగినవన్ని తలచుకుని ఇప్పుడు ఏడుస్తోంది. కానీ ఏం లాభం. ఆడపిల్లలు అమాయకంగా, తెలివి లేకుండా ఉంటే.. ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొవాల్సి వస్తుంది అన్న దానికి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తోంది నిహారిక జీవితం. అమాయకత్వం, ఆలోచనారహిత పనుల వల్ల నిహారిక జీవితం నాశనం అయ్యిందని మీరు భావిస్తున్నారా.. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.