రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన బీటెక్ నవీన్ హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో హరితో పాటు అతడి గర్ల్ ఫ్రెండ్, మరో స్నేహితుడు హసన్‌ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా డీసీపీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ వివరాలు..
అబ్దుల్లాపూర్‌మెట్ బీటెక్ విద్యార్థి నవీన్ హత్య కేసులో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. హరిహరృష్ణను ఇప్పటికే అదుపులోకి తీసుకున్న పోలీసులు అతడిని విచారిస్తున్నారు. అంతేకాక ఈ కేసులో కీలకంగా భావిస్తోన్న హరి స్నేహితురాలిని, అతడి స్నేహితుడు హసన్‌ను పోలలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో హరిహరకృష్ణ ఏ1, హసన్‌ను ఏ2, స్నేహితురాలిని ఏ3గా నమోదు చేశారు. ఇక యువతి కోసమే హరిహరకృష్ణ.. నవీన్‌ను ఇంత దారుణంగా హత్య చేశాడని వెల్లడైంది. హత్య జరిగిన తర్వాత హరి తన స్నేహితురాలిని తీసుకుని సంఘటనా స్థలానికి వెళ్లడమే కాక.. ఆ తర్వాత ఆమెతో కలిసి రెస్టారెంట్‌కు వెళ్లి భోజనం చేశాడు.
వీరి తీరు చూసి పోలీసులే షాక్ అవుతున్నారు. స్నేహితుడిని ఇంత దారుణంగా హత్య చేయడమే కాక ఏదో సరదాగా వెళ్లి హత్య చేసిన ప్రాంతాన్ని సందర్శించారంటే.. వీరి ఎంత సైకోలో అర్థం అవుతుంది అంటున్నారు. అంతేకాక నిందితుల్లో తప్పు చేశామన్న ఫీలింగ్ ఏ కోశానా లేకపోవడం, ఏమాత్రం భయం లేకపోవడం చూసి పోలీసులే ఆశ్చర్యపోతున్నారు. ఇక కేసులో హరి స్నేహితురాలిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆమెకు వైద్య పరీక్షలు చేసిన తర్వాత రిమాండ్‌కు తరలించారు.
ఈ సందర్భంగా కేసును దర్యాప్తు చేస్తోన్న డీసీపీ సాయి శ్రీ మాట్లాడుతూ.. ఈ కేసులో యువతి ప్రమేయం ఏంటి.. అనే దాని గురించి ఆసక్తికర విషయాలు తెలియజేశారు. ఈ కేసులో ఆ యువతి చేసిన తప్పు ఒక్కటే అని.. అది ఏంటో వివరించారు డీసీపీ. ఈ సందర్భంగా డీసీపీ సాయి శ్రీ మాట్లాడుతూ.. ‘‘ఇప్పటి వరకు జరిగిన విచారణలో ఈ హత్య గురించి యువతికి ముందే ఎలాంటి సమాచారం తెలియదు. హరి దారుణానికి ఒడి గట్టిన తర్వాత ముందు తన స్నేహితుడు హసన్ దగ్గరికి వెళ్లి.. రక్తంతో ఉన్న తన బట్టలు మార్చుకుని.. హసన్ డ్రెస్ వేసుకుని వెళ్లిపోయాడు. ఇక ఈ కేసులో హసన్.. నవీన్ బట్టలు మార్చడానికి, వాటిని తగలబెట్టడానికి సాయం చేశాడు. నవీన్ శరీర భాగాలను ఎక్కడెక్కడ పడేశాడు అనే పూర్తి వివరాలు హసన్‌కు తెలుసు’’ అని వెల్లడించారు.
‘‘ఇక యువతి విషయానికి వస్తే.. నవీన్‌ని హత్య చేసిన తర్వాతనే ఆమెకు ఈ విషయం తెలిసింది. హరి, నవీన్‌ను చంపుతాడనే విషయం ముందుగా ఆమెకు తెలియదు. అయితే నవీన్ హత్య గురించి తెలిసిన తర్వాత.. ఆమె హరితో కలిసి హత్య జరిగిన ప్రాంతానికి వెళ్లింది. ఆ తర్వాత హరి.. తన ఊరు వరంగల్ వెళ్లడానికి డబ్బులు లేవని చెప్పడంతో అతడికి 1500 రూపాయలు ఇచ్చింది. ఈ మొత్తం కేసులో యువతి చేసిన తప్పు ఏంటంటే.. హత్య గురించి తెలిసినా.. దాని గురించి పోలీసులకు చెప్పలేదు. ఇది మాత్రమే ఆమె చేసిన నేరం. నేరం గురించి చెప్పకపోవడం తప్పు.. స్క్రీనింగ్ ఆఫ్ ఎవిడెన్స్ కిందకు వస్తుంది’’ అని తెలిపారు.