ఆంధ్రప్రదేశ్‌లో ఘోర ప్రమాదం జరిగి ఎనిమిది మంది సజీవ దహనం అయ్యారు. ప్రయాణికులతో వెళ్తున్న ఆటోపై హైటెన్షన్ విద్యుత్ వైర్లు పడి ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 8మంది సజీవ దహనం అయ్యారు. ఈ హృదయవిదారక ఘటన ఏపీలోని సత్యాసాయి జిల్లా తాడిమర్రి మండలం చిల్లకొండయ్యపల్లి గ్రామంలో జరిగింది. మృతులు గుండంపల్లి వాసులుగా సమాచారం. వ్యవసాయపనులకు ఆటోలో వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది. ఆటోలో 10మందికిపైగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనలో మరికొందరు గాయపడినట్లు తెలుస్తోంది.
ప్రమాదం జరిగిన వెంటనే అక్కడ ఉన్న స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేశారు. ఈ ప్రమాదంపై ఏపీ సీఎం జగన్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలు ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. అలాగే.. ఈ ప్రమాదంలో గాయపడ్డవారికి మెరుగైన వైద్యం అందించాలని తెలిపారు. బాధితుల కుటుంబాలకు అండగా నిలవాలని సీఎం జగన్ ఈ సందర్భంగా ప్రస్తావించినట్లు తెలుస్తోంది. బాధిత కుటుంబాలకు అండగా నిలుస్తామని భరోసా ఇచ్చారు.
మరోవైపు.. సత్యసాయి జిల్లా ఘోర ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతికి వ్యక్తం చేసిన గవర్నర్ బిశ్వ భూషణ్ హరి చందన్,, ఆటోపై హైటెన్షన్ వైర్లు తెగిపడి, దానిలో ప్రయాణిస్తున్న కూలీల మృతి విచారకరమన్న గవర్నర్, జిల్లా యంత్రాంగం నుండి పూర్తి సమాచారం తీసుకోవాలని రాజ్ భవన్ అధికారులకు ఆదేశించారు. ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.