డబ్బు సంపాదించడం అనేది చాలా మందికి ఒక పెద్ద సవాల్. స్టాక్ మార్కెట్లు, ఇతర వాటిలో పెట్టుబడులు పెట్టి డబ్బు సంపాదించాలనుకున్నా రిస్క్ ఎక్కువ ఉంటుంది. రిస్క్ ఎక్కువ అని డబ్బుని ఊరికే ఇంట్లో పెట్టుకోవడం వల్ల ఉపయోగం ఉండదు. అలా అని రిస్క్ చేయలేము. ఇలా కాకుండా మరీ ఎక్కువ లాభాలు లేకపోయినా.. పెట్టిన డబ్బులు కొన్నాళ్ళకి డబుల్ అయితే చాలు, రిస్క్ లేకుండా ఉంటే చాలు అనుకుంటున్నారా? ఇలా ఆలోచించేవారికి ఇది నిజంగా శుభవార్తే. ఇప్పటికే బ్యాంకులు, పోస్టాఫీస్ స్కీములు ఇన్వెస్టర్లకు మంచి రాబడులు అందించే పథకాలను అందుబాటులోకి తెచ్చాయి. పోస్టాఫీస్ స్కీమ్స్ తో పోలిస్తే అధిక వడ్డీని ఇచ్చే కొన్ని బ్యాంకులు ఉన్నాయి.
అయితే ఈ అధిక వడ్డీ ఇచ్చేది.. పెద్ద పెద్ద కార్పొరేట్ బ్యాంకులు కాదు. చిన్న ఫైనాన్స్ బ్యాంకులు. ఫిక్సిడ్ డిపాజిట్లపై ఖాతాదారులకు అధిక వడ్డీని ఆఫర్ చేస్తున్నాయి. యూనిటీ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, సూర్యోదయ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్.. ఈ రెండు బ్యాంకులు తమ కస్టమర్లకు ఫిక్సిడ్ డిపాజిట్ మీద అధిక వడ్డీ చెల్లిస్తున్నాయి. యూనిటీ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు 366 రోజుల ఎఫ్డీ స్కీం కింద సాధారణ ఖాతాదారులకు 7.8 శాతం వడ్డీ ఇస్తుంది. ఇక సీనియర్ సిటిజన్స్ కైతే 8.3 శాతం అధిక వడ్డీ ఇస్తుంది. ఇదిలా ఉండగా మరో ఎఫ్డీ స్కీంను ఇటీవలే అందుబాటులోకి తెచ్చింది. ఈ స్కీం కింద కూడా అధిక వడ్డీ కల్పిస్తుంది. ఇక సూర్యోదయ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులో కూడా ఫిక్సిడ్ డిపాజిట్ మీద అధిక వడ్డీ లభిస్తుంది.
999 రోజుల ఎఫ్డీపై సీనియర్ సిటిజన్స్ కి 8.26 శాతం వడ్డీ చెల్లిస్తుంది. సాధారణ ఖాతాదారులకైతే 8.01 శాతం వడ్డీ ఇవ్వనుంది. ఈ లెక్కన బ్యాంకులో లక్ష రూపాయలు ఫిక్సిడ్ డిపాజిట్ చేస్తే పదేళ్లలో 2 లక్షలు అవుతుంది. అయితే ఫిక్సిడ్ డిపాజిట్ టెన్యూర్ అయిపోయిన తర్వాత రెన్యువల్ చేసుకోవాలి. ఆ టెన్యూర్ లో వడ్డీ రేటు 8 శాతం పైన ఉంటేనే ఈ రాబడి వస్తుందని గ్రహించాలి. ఇవి కాకుండా రిక్కరింగ్ డిపాజిట్ స్కీంలు కూడా అందుబాటులో ఉన్నాయి. వంద రూపాయల నుంచి ఈ ఆర్డీ ఖాతాల్లో డిపాజిట్ చేయవచ్చు. 21 నెలలు, 24, 27, 30 నెలల టెన్యూర్లలో ఏదో ఒక టెన్యూర్ ని ఎంచుకుంటే 7.51 శాతం వరకూ వడ్డీ పొందవచ్చు. ఒకేసారి ఫిక్సిడ్ డిపాజిట్ చేయాలనుకున్నా, నెల నెలా కొంత మొత్తం చొప్పున డిపాజిట్ చేయాలనుకున్నా ఈ రెండు ఫైనాన్స్ బ్యాంకులు ఉత్తమ ఛాయిస్ అని చెప్పుకోవచ్చు.