టాటా కంపెనీ, దాని ఉత్పత్తుల మీద ప్రజలకు చాలా నమ్మకం. విలువలకు కట్టుబడి ఉంటుందని నమ్ముతారు జనాలు. ఉప్పు మొదలు విమానాయానం వరకు ప్రతి రంగంలోను రాణిస్తోంది టాటా కంపెనీ. తాజాగా మరో రంగంలోకి ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతోంది. అది దిగ్గజ రిలయన్స్‌కు పోటీగా. ఇంతకు ఏమా రంగం అంటే.. బ్యూటీ అండ్ పర్సనల్ కేర్ మార్కెట్‌లోకి ఎంట్రీ ఇచ్చి.. అంబానీతో ఢీ కొట్టేందుకు రెడీ అవుతోంది టాటా గ్రూప్. ప్రస్తుతం బ్యూటీ అండ్ పర్సనల్ కేర్ మార్కెట్ ఎంతలా విస్తరించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. పైగా ఎప్పటికి డిమాండ్ తగ్గని మార్కట్ ఇది. ఒకప్పుడు అందం గురించి శ్రద్ధ తీసుకోవడం అంటే కేవలం ఆడవారు మాత్రమే అన్నట్లు ఉండేది. అయితే ఇప్పుడు ట్రెండ్ మారింది. మగాళ్లు కూడా తమ లుక్స్ మీద దృష్టి పెడుతున్నారు. అందాన్ని కాపాడుకోవడం కోసం రకరకాల ఉత్పత్తులు వాడుతున్నారు.
ఇక బ్యూటీ అండ్ పర్సనల్ కేర్ మార్కెట్‌లో ప్రపంచంలోనే ఇండియా రెండో స్థానంలో ఉంది అంటేనే అందం గురించి మనవాళ్లు తీసుకునే శ్రద్ధ ఏ రేంజ్‌లో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికే ఈ రంగంలో ప్రపంచ కుబేరుడు బెర్నార్డ్ ఆర్నాల్ట్ ఎల్‌వీఎంహెచ్‌కు చెందిన సెఫోరా, దేశీయ బ్యూటీ ప్రొడక్ట్ దిగ్గజం నైకా సహా రిలయన్స్ సెంట్రో వంటికి రాణిస్తున్నాయి. అయితే ఈ రంగంలోకి టాటా ఎంట్రీతో ఈ కంపెనీలకు గట్టి పోటీ తప్పేలా లేదు. నైకాకు ఇప్పటికే దేశవ్యాప్తంగా 124 బ్యూటీ స్టోర్లు ఉండగా.. త్వరలో మరో 300 తెరవాలనే ఆలోచనలో ఉంది. మరోవైపు రిలయన్స్ రిటైల్ కూడా ఇటీవల బ్యూటీ అండ్ ఫ్యాషన్ ప్రొడక్ట్స్‌తో రిలయన్స్ సెంట్రోను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు వీటికి పోటీ ఇచ్చేందుకు టాటా కంపెనీ రెడీ అవుతోంది.
బ్యూటీ అండ్ పర్సనల్ కేర్ రంగంలోకి ఎంట్రీ ఇవ్వాలని భావిస్తోన్న టాటా.. ఫారెన్ బ్రాండ్లను దేశ యువతకు పరిచయం చేసే యోచనలో ఉందని టాక్. ఈ మేరకు పలు విదేశీ కంపెనీలతో ఒప్పందాలు కూడా చేసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. టాటాలు ఇప్పటికే టాటా బ్యూటీ షాపింగ్ యాప్‌ను ప్రారంభించారు. దీని పేరు టాటా క్లిక్ పాలెట్(Tata CLiQ Palette). ఇక వచ్చే ఏడాది మార్చిలో టాటాలకు చెందిన మొదటి బ్యూటీ టెక్ స్టోర్ ప్రారంభం కావొచ్చని సమాచారం. వచ్చే ఆర్థిక సంవత్సరంలో దీనిని మరింత విస్తరించాలని చూస్తోంది. మొదట చిన్న ప్రదేశాల్లో కాకుండా ఢిల్లీ, ముంబయి వంటి ప్రధాన నగరాల్లో స్టోర్స్ ఒపెన్ చేయాలని.. తర్వాత మరో 40 వరకు స్టోర్లను తెరవాలని టాటాలు భావిస్తున్నట్లు సమాచారం.