ఇప్పటివరకు నోట్లను వెదజల్లే ఎటీఎంలను ఎన్నో చూశాం.. ఎటీఎం మెషిన్ లో డెబిట్/క్రెడిట్ పెట్టి పాస్‌వర్డ్ నొక్కగానే.. చకచకా నోట్లు బయటకొస్తుంటాయి. అయితే, ఆర్‌బీఐ తీసుకున్న తాజా నిర్ణయంతో రాబోవు రోజుల్లో ఎటీఎంల నుండి నాణేలు గలగలా రాలనున్నాయి. చిల్లర సమస్యలకు చెక్ పెట్టేందుకు.. ఆర్‌బీఐ కాయిన్ వెండింగ్ మెషిన్లను అందుబాటులోకి తీసుకురానుంది. తొలుత 12 నగరాల్లో ఈ కాయిన్ వెండింగ్ మెషిన్లను ఏర్పాటు చేయనున్నట్లు ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ బుధవారం వెల్లడించారు.
నాణేలు కావాలనుకునేవారు ఈ కాయిన్ వెండింగ్ మెషిన్ల ద్వారా తీసుకోవచ్చు. అందుకోసం.. క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయాల్సి ఉంటుంది. అంటే.. నోటు ఇచ్చి చిల్లర వెనక్కు తీసుకోవాల్సిన అవసరం ఉండదు. యూపీఐ ద్వారా బ్యాంకు ఖాతాలో ఉన్న నగదును చెల్లించి నాణేలు పొందొచ్చు. క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి.. ఎంత మొత్తంలో కాయిన్స్ కావాలో నిర్ధారించుకున్నాక.. కస్టమర్ బ్యాంక్ ఖాతా నుంచి ఆ మేరకు డబ్బులు ఆటోమేటిక్‌గా కట్ అయ్యి కాయిన్స్ బయటకొస్తాయన్నమాట. పైలట్ ప్రాజెక్ట్ కింద తొలుత 12 నగరాల్లోని 19 చోట్ల ఈ యంత్రాలను ఏర్పాటు చేయనుంది ఆర్‌బీఐ. రద్దీ ఎక్కువగా ఉన్న ప్రాంతాలైన మార్కెట్లు, రైల్వే స్టేషన్లు, బస్టాండ్‌లు, షాపింగ్ మాల్స్ వంటి ప్రాంతాల్లో తొలుత వీటిని ఏర్పాటు చేయనున్నారు. అనంతరం వీటికి వచ్చే స్పందన, అనుభవాలను బట్టి దేశవ్యాప్తంగా విస్తరించే ప్రయంత్నం చేయనున్నారు.
అయితే, ఈ కాయిన్ వెండింగ్ మెషీన్స్‌కు సంబంధించి విధివిధానాలు ఇంకా పూర్తి స్థాయిలో ఖరారు చేయలేదని తెలుస్తోంది. పైలట్ ప్రాజెక్ట్ నుంచి వచ్చే సలహాలు, సూచనలు ఆధారంగా మార్గదర్శకాలను రూపొందించి జారీ చేయనున్నారు. ప్రస్తుతం చిల్లర దొరకడం అన్నది కూడా సమస్యగా పరిణమించింది. ముఖ్యంగా ఆర్‌టీసీ బస్సుల్లో, చిల్లర దుకాణాల్లో ఇది ఎక్కువుగా కనిపిస్తూ ఉంటుంది. బస్ కండక్టర్ చిల్లర లేదు.. రేపు తీసుకో అని సమాధానం ఇస్తే, కిరాణా కొట్టు యజమాణులు.. రెండు రుపాయలకు రెండు చాక్లెట్లు తీసుకో అని చెప్తుంటారు. ఈ కాయిన్ వెండింగ్ మెషిన్లను అందుబాటులోకి వస్తే.. చిల్లర సమస్యలకు చెక్ పడినట్లేనా..? మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
.@RBI to install QR Code based coin vending machines on a pilot basis in 12 cities#RBIPolicy #UPI #policy #ratehike #India pic.twitter.com/ioxPWmG3Ac
— CNBC-TV18 (@CNBCTV18News) February 8, 2023