వృద్ధాప్యంలో పిల్లలు తల్లిదండ్రులను చూస్తారో లేదో తెలియదు. అలాంటి సమయంలో తోడుగా ఉండే పథకం గురించి తెలుసుకోండి. ఏటా రూ. 72 వేలు జీవితాంతం పొందచ్చు. ఆ పథకం గురించి పూర్తి వివరాలు మీ కోసం.
ఉద్యోగం చేసే సమయంలో జీవితం గురించి ఎలాంటి టెన్షన్ ఉండదు. నెలానెలా జీతం వస్తుంది. దాంతో గడిచిపోతుంది. మరి పదవీ విరమణ తర్వాత పరిస్థితి ఏంటి.. ప్రభుత్వ ఉద్యోగాలు, పీఎఫ్ కంట్రిబ్యూషన్ ఉన్న వారికి పర్వాలేదు. కానీ అసంఘటిత రంగం అంటే.. కార్మికులు, వీధి వ్యాపారులు, మధ్యాహ్న భోజన కార్మికులు, ఇతరాత్ర పనులు చేసుకునే వారు, భూమిలేని కార్మికులు, వ్యవసాయ కార్మికులు, బీడీ, చేనేత కార్మికులు వంటి వారి పరిస్థితి ఏంటి. ఒంట్లో ఓపిక ఉన్ననాళ్లు కష్టపడి పని చేస్తారు.. చేతిలో నాలుగు రూపాయలు ఉంటాయి. కానీ ఒంట్లో శక్తి సన్నగిల్లి.. పని చేయలేని వేళ.. పరిస్థితి ఏంటి. మరి వారికి కూడా పదవీ విరమణ వయసు తర్వాత నెలానెలా పెన్షన్ లభిస్తే.. జీవిత చరమాంకంలో వారికి ఎంతో భరోసాగా ఉంటుంది. అలాంటి వారి కోసమే కేంద్ర ప్రభుత్వం ఓ పథకాన్ని ప్రారంభించింది. అదే ప్రధాన్ మంత్రి శ్రమయోగి మాన్‌ధన్ యోజన పథకం. దీనిలో చేరితో భార్యాభర్తలిద్దరికి నెలకు 6 వేల రూపాయలు పెన్షన్ లభిస్తుంది. పూర్తి వివరాలు..
అసంఘటిత రంగంలో పని చేస్తున్న కార్మికుల కోసం ఉద్దేశించిన పథకం ఇది. అంటే.. కార్మికులు, వీధి వ్యాపారులు, మధ్యాహ్న భోజన కార్మికులు, ఇతరాత్ర పనులు చేసుకునే వారు, భూమిలేని కార్మికులు, వ్యవసాయ కార్మికులు, బీడీ, చేనేత కార్మికులు, తోలు పరిశ్రమలో పని చేసేవారు ఈ పథకానికి అర్హులు. అలానే నెలవారీ ఆదాయం 15 వేల తక్కువ వుండి.. 18-40 ఏళ్ల లోపు వయసు గల ఇతర వృత్తుల వారు కూడా ఈ పథకానికి అర్హులే.
ఇక భార్యాభర్తిలిద్దరు ఈ పథకంలో చేరవచ్చు. ఉదాహరణకు ప్రస్తుతం దంపతుల వయసు 30 ఏళ్లు అనుకుందాం. వీరు నెలకు చెరో 100 చెల్లిస్తే.. 60 ఏళ్ల తర్వాత ఏటా చెరో 36 వేల రూపాయలు అనగా ఇద్దరికి కలిపి 72 వేల రూపాయల పెన్షన్ లభిస్తుంది. మీరు 18 వ ఏట నుంచే ఈ పెన్షన్ పథకంలో చేరితే నెలకు 55 రూపాయలు చెల్లింపుతో ప్రారంభలమవుతుంది. ఒకవేళ మీరు 40వ ఏట ఈ పథకంలో చేరితో.. అప్పుడు నెలకు 200 రూపాయలు చెల్లించాల్సి వస్తుంది. అంటే 40 ఏళ్ల వయసులో దంపతులిద్దరూ ఈ పథకంలో చేరితో.. వారు చెరో 200 చొప్పున 400 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది.
ఒకవేళ పథకంలో చేరిన వారు మరణిస్తే.. అప్పుడు వారి భాగస్వామికి సగం పెన్షన్ వస్తూనే ఉంటుంది. లేదంటే డిపాజిట్ చేసిన డబ్బులను వెనక్కి పొందొచ్చు. ఈ పథకం పట్ల ఆసక్తి ఉన్నవారు మీకు దగ్గరలోని కామన్ సర్వీస్ సెంటర్స్ స్కీమ్(సీఎస్‌సీ)ని సందర్శించాల్సి ఉంటుంది. ఈ పథకం తెరవానలుకునేవారికి తప్పనిసరిగా మొబైల్ ఫోన్, సేవింగ్స్ బ్యాంక్ ఖాతా, ఆధార్ నంబర్ కలిగి ఉండాలి.