పాన్ కార్డుని ఆధార్ తో అనుసంధానం చేసేందుకు ఇంకా కొన్ని రోజుల గడువు మాత్రమే ఉంది. ఈ మార్చి 31 తర్వాత ఆధార్ తో లింక్ కాని పాన్ కార్డులు చెల్లవని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. అయితే ఇప్పుడు మరోసారి ఈ గడువు పెరిగే అవకాశం ఉందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.
ఇప్పుడు ఏ ఇద్దరిని కదిలించినా కూడా పాన్ కార్డు– ఆధార్ కార్డ్ లింక్ గురించే మాట్లాడతున్నారు. ఎందుకంటే ఇంకా కొన్ని రోజులు మాత్రమే గడువు ఉంది. ఇప్పటికే చాలా మంది రూ.వెయ్యి లేట్ ఫీ కట్టి మరీ తమ ఆధార్- పాన్ కార్డులను లింక్ చేసుకుంటున్నారు. ఇంకా చాలామంది ఈ ప్రక్రియ పూర్తి చేయని వాళ్లు కూడా ఉన్నారు. అలాంటి వారి పాన్ కార్డులు మార్చి 31 తర్వాత చెల్లవని కేంద్రం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. అయితే ఇక్కడ చదువుకున్న వాళ్లు, ఇంటర్నెట్ సదుపాయం, ఇంటర్నెట్ సెంటర్లు సౌకర్యం ఉన్నవాళ్లు అందరూ ఈ పనిని పూర్తి చేస్తున్నారు. కానీ, పల్లెటూర్లలో ఇంటర్నెట్ సదుపాయం లేని ప్రాంతాల్లో వాళ్లు ఈ ప్రక్రియ పూర్తి చేయడం కష్టమనే చెప్పాలి.
పాన్- ఆధార్ కార్డు అనుసంధానికి మార్చి 31తో గడువు ముగుస్తున్న విషయం తెలిసిందే. ఏప్రిల్ 1 నుంచి అనుసంధానం కాని ప్రతి పాన్ కార్డు చెల్లనిదిగా పరిగణిస్తామని కేంద్రం ఇప్పటికే ప్రకటించింది. మార్చి 31లోపు పాన్ అనుసంధానం చేయాలి అంటే రూ.1000 ఫైన్ కూడా చెల్లించాల్సి ఉంటుంది. ఆ తర్వాతే మీ పాన్ కార్డు- ఆధార్ తో లింక్ చేసేందుకు మీరు రిక్వెస్ట్ పెట్టాల్సి ఉంటుంది. ముందుగా మీ పేరు పాన్ కార్డ్- ఆధార్ లో ఒకేలా ఉండాలి. అలా లేని పక్షంలో కచ్చితంగా ఏదొక దాంట్లో మీరు అప్ డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఫైన్ కట్టి ఆధార్- పాన్ కార్డుని అనుసంధానం చేసుకోవాలి.
మీ పాన్ కార్డు చెల్లకపోతే మీ బ్యాంక్ ఖాతాలు, ట్యాక్స్ రిటర్న్స్ వంటి విషయాల్లో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాగే రూ.50 వేలకు మించి లావాదేవీలు చేసే సమయంలో రూ.10 వరకు ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడు కొత్త వాదన వినిపిస్తోంది. మార్చి 31 తర్వాత కూడా పాన్- ఆధార లింకింగ్ గడువు పొడిగిస్తారని కొందరు కామెంట్ చేస్తున్నారు. అలాగే ఫీజు కూడా మాఫీ చేస్తారంటూ కామెంట్ చేస్తున్నారు. ఎందుకంటే.. కాంగ్రెస్ ఎంపీ అధిర్ రాజన్ చౌదరి ప్రధానికి లేఖ రాశారు. పాన్ లింకింగ్ గడువు మరో ఆరు నెలలు పెంచాలని, ఫీజు కూడా మాఫీ చేయాలని కోరారు. గ్రామీణ ప్రాంతాల్లో స్థానిక, సబ్ పోస్టాఫీసులకు ఉచితంగా లింక్ చేసేందుకు అధికారం ఇవ్వాలని కోరారు. ఈ నేపథ్యంలోనే గడువు మరోసారి పెరిగే అవకాశం ఉంటుందని కామెంట్స్ వినిపిస్తున్నాయి.