మెకానిక్, మెకానికల్ ఇంజనీరింగ్ ను వేరు చేసే పదం చదువే గానీ జ్ఞానం కాదు. జ్ఞానం ఉంటే అందరూ ఇంజనీర్లే. ప్రజలకు పనికొచ్చే వస్తువులు కనుక్కుంటే.. సమస్యలకు పరిష్కారం చూపెట్టగలిగితే వాళ్ళే ఇంజనీర్లు. ప్రస్తుతం వాహనదారులు పెరుగుతున్న పెట్రోల్ ధరల భారాన్ని మోస్తున్న సంగతి తెలిసిందే. ఈ భారం పడకుండా ఉండాలంటే విద్యుత్ బ్యాటరీ వాహనాలను కొనుగోలు చేస్తే మేలని అనుకుంటున్నారు. కొంతమంది అయితే తామే సొంతంగా విద్యుత్ వాహనాలను తయారు చేసుకుంటున్నారు. పాత మోటార్ వాహనాన్ని కన్వర్టర్ కిట్ల ద్వారా విద్యుత్ వాహనాలుగా మార్చుకుంటున్నారు. ఈ కోవకు చెందిన వ్యక్తే షేక్ చిన్న మస్తాన్ వలి.
షేక్ చిన్న మస్తాన్ వలి పల్నాడు జిల్లా పిడుగురాళ్లకు చెందిన ఒక సాధారణ మోటార్ మెకానిక్. సంపాదించిన దాంట్లో సగం పెట్రోల్ కే పోతుందని ఆలోచించిన షేక్ చిన్న మస్తాన్.. పెట్రోల్ సమస్యకు పరిష్కారం కనుగొనాలని అనుకున్నారు. పెట్రోల్ అవసరం లేకుండా బైక్ తయారు చేస్తే బాగుంటుందని ఆలోచించిన ఆయన.. సోలార్ శక్తితో నడిచే బైక్ ని తయారు చేశారు. బైక్ మీద ఒక సోలార్ ప్యానెల్ ను అం,అమర్చి.. బైక్ సీట్ కింద ఒక బ్యాటరీని అమర్చారు. సోలార్ శక్తిని గ్రహించిన సోలార్ ప్యానెల్.. ఆ శక్తిని బ్యాటరీలోకి పంపుతుంది. బ్యాటరీ నుంచి వచ్చే శక్తితో బైక్ నడుస్తోంది. ఇలా పగలంతా నడిచే ఈ బైక్ 80 కి.మీ. మైలేజ్ ఇస్తుందని షేక్ మస్తాన్ వలి అంటున్నారు. అయితే రాత్రిపూట కూడా ఈ బైక్ మీద ప్రయాణించే వీలు ఉండేలా బ్యాటరీకి ఛార్జింగ్ పెట్టుకోవచ్చునని అంటున్నారు.
2 గంటలు ఛార్జింగ్ పెడితే.. 80 కి.మీ. ప్రయాణం చేయవచ్చునని అంటున్నారు. ఈ సోలార్ బైక్ మీద నలుగురు కూర్చుని ప్రయాణించవచ్చునని అంటున్నారు. దీని కోసం ఆయనకు లక్షా 20 వేలు ఖర్చు అయినట్లు వెల్లడించారు. రానున్న రోజుల్లో సోలార్ తో నడిచే ఆటోని తయారు చేస్తానని అంటున్నారు. షేక్ చిన్న మస్తాన్ వలి తయారు చేసిన ఈ సోలార్ బైక్ ను చూసిన స్థానికులు ఆయనను అభినందిస్తున్నారు. ఇంకో విషయం ఏంటంటే.. వర్షానికి తడవకుండా, ఎండకి ఎండకుండా బైక్ పై ఉన్న సోలార్ ప్యానెల్ మనల్ని రక్షణగా ఉంటుంది. వర్షాలు పడ్డప్పుడు కొంచెం స్లోగా నడుస్తుంది. కానీ బ్యాటరీ ఛార్జింగ్ పెట్టుకుంటే సమస్య ఉండదు. ఇలాంటి వాళ్ళను ప్రోత్సహిస్తే ఇలాంటి అద్భుతాలు ఎన్నో చేయగలుగుతారు. మరి దీనిపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.