దేశంలో రోజు రోజుకి స్టార్టప్ కల్చర్ విపరీతంగా పెరిగిపోతుంది. ప్రతి ఏడాది వందలాది కొత్త స్టార్టప్ కంపెనీలు పుట్టుకొస్తున్నాయి. 2013-14లో 4వేల స్టార్టప్‌లు మాత్రమే ఉండగా.. ఇప్పుడు ఆ సంఖ్య 60వేలకు చేరింది. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఇటీవల స్టార్టప్‌లు దూకుడు చూపుతున్నాయి. అవకాశాలను అందిపుచ్చుకుంటూ పలు విభాగాలలో కంపెనీలు ఆవిర్భవిస్తున్నాయి. వెరసి దేశీయంగా స్టార్టప్‌ల హవా నెలకొంది. ఇప్పటికే బిలియన్ డాలర్ల విలువను అందుకున్న స్టార్టప్‌లు 103కు చేరాయి. 1 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 7,500 కోట్లు) వేల్యుయేషన్ దక్కించుకున్న సంస్థలను యూనికార్న్‌లుగా గుర్తిస్తారు.
స్టార్టప్ రంగంలో దూసుకుపోతున్న భారత్ అత్యధిక సంఖ్యలో యూనికార్న్ సంస్థలున్న దేశాల జాబితాలో 3వ స్థానానికి ఎగబాకింది. ఈ విషయంలో బ్రిటన్‌ను అధిగమించింది. గతేడాది ఆఖరు నాటికి ఈ విషయంలో భారత్ నాలుగో స్థానంలో ఉంది. హురున్ రీసెర్చ్ నివేదిక ప్రకారం అమెరికా, చైనా టాప్‌లో కొనసాగుతున్నాయి. భారత్ మూడో స్థానంలో ఉంది. ఇదే జోరు కొనసాగితే ఇండియా నెక్ట్స్ టార్గెట్ చైనాను అధిగమించడమే అవుతుంది.
అమెరికా నంబర్ 1
అమెరికాలో ఈ ఏడాది కొత్తగా 254 యూనికార్న్‌లు పుట్టుకురాగా మొత్తం సంఖ్య 487 చేరడంతో నంబర్ వన్‌గా కొనసాగుతోంది. ఇక చైనాలో 74 కొత్త సంస్థల రాకతో యూనికార్న్ హోదా దక్కించుకున్న స్టార్టప్‌ల సంఖ్య 301కి చేరింది. తద్వారా చైనా రెండో స్థానంలో నిల్చింది. ఇక నగరాలవారీగా చూస్తే బెంగళూరులో అత్యధికంగా యూనికార్న్‌లు ఉన్నాయి.
భారతదేశంలోని స్టార్టప్‌లు దేశానికి వెన్నముకగా నిలుస్తాయని ఆశాభావం వ్యక్తంచేసిన ప్రధాని.. ప్రోత్సాహకంలో భాగంగా జనవరి 16ను నేషనల్ స్టార్టప్ డేగా ప్రకటించారు. యువత మరిన్ని ఆలోచనలు చేసి ప్రపంచంలో భారత్ పేరును అగ్రగ్రామిగా నిలపాలని మోదీ సూచించారు.
ఇది కూడా చదవండి: Mukesh Ambani : ముగ్గురు పిల్లలకు.. చాలా తెలివిగా అంబానీ వీలునామా…!