హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ తమ కస్టమర్లకు బ్యాడ్ న్యూస్ చెప్పింది. వరుసగా మూడో నెలలో కూడా మార్జినల్ కాస్ట్ ఆఫ్ లెండింగ్ రేట్(ఎంసీఎల్‌ఆర్)ను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. అది కూడా నేటి నుంచే(ఆగస్టు 8) అమలులోకి రానున్నట్లు తెలిపింది. ఈ నిర్ణయంతో గృహ, వ్యక్తిగత, ఆటో, ఇతర లోన్లపై వడ్డీ రేటు పెరగనుంది. దీని ద్వారా కస్టమర్లు చెల్లించే నెలవారీ వాయిదాలు కూడా పెరగనున్నాయి.
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ రుణాలపై అన్ని టెన్యూర్లకు సంబంధించి ఎంసీఎల్‌ఆర్‌ను 10 బేసిస్ పాయింట్లు పెంచనున్నట్లు ప్రకటించింది. అందుకు సంబంధించిన వివరాలను హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. గతంలో 7.70గా ఉన్న బేసిస్ పాయింట్లు ప్రస్తుతం 7.80కి పెంచారు. అన్ని టెన్యూర్లపై ఈ ఎంసీఎల్‌ఆర్‌ను పెంచారు. ఒక నెల కాలపరిమితి కలిగిన రుణంపై 7.80 శాతంగా ఉంది. 3 నెలల కాలపరిమితి కలిగిన రుణంపై 7.85 శాతం, 6 నెలల రుణంపై 7.95 శాతం, ఏడాది కాల వ్యవధి కలిగిన రుణానికి ఎంసీఎల్‌ఆర్ 8.10 శాతం, రెండేళ్లకు 8.20, మూడేళ్ల కాలపరిమితి కలిగిన రుణానికి 8.30 శాతం ఎంసీఎల్‌ఆర్‌గా నిర్ణయించారు.
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ వరుసగా మూడు నెలలు తమ ఎంసీఎల్‌ఆర్ బేసిస్ పాయింట్లు పెంచింది. జూన్‌లో 35, జులైలో 20, ఆగస్టులో 10 బేసిస్ పాయింట్లు చొప్పున హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఎంసీఎల్‌ఆర్‌ను పెంచుతూ వచ్చింది. అందుకు కారణం లేకపోలేదు.. ఆర్‌బీఐ రెపో రేటును పెంచడమే ఇందుకు కారణంగా చెబుతున్నారు. ఆర్బీఐ రెపో రేటును మే నెలలో 40, జూన్ నెలలో 50 బేసిస్ పాయింట్ల చొప్పున పెంచింది. ఇటీవల జరిగిన పాలసీ రివ్యూలో మరోసారి 50 బేసిస్ పాయింట్లు పెంచుతూ ఆర్బీఐ నిర్ణయం తీసుకుంది.
ద్రవ్యోల్భణాన్ని అదుపులో ఉంచేందుకే రిజర్వ్ బ్యాంక్ ఆప్ ఇండియా ఈ రేట్లను పెంచుతోందని చెబుతున్నారు. రెపో రేటు పెరగడంతో బ్యాంకులు కూడా వడ్డీ రేట్లను పెంచుతున్నాయి. సామాన్యులపై మాత్రం గృహ, వ్యక్తిగత, ఆటో, ఇతర లోన్లకు సంబంధించి ఈఎంఐలు మరింత భారం కానున్నాయి. పెరుగుతున్న వడ్డీ రేట్లపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.