మన సమాజంలో మహిళలు అంటే నేటికి ఎంతో చిన్న చూపు. వారు ఉద్యోగాలు చేసినా.. వ్యాపారాలు చేసి ఉన్నత శిఖరాలు చేరితే ఏదో ఓ పుల్ల విరుపు మాటే వస్తుంది తప్ప.. ప్రశంసించడానికి నోరు రాదు చాలా మందికి. అయితే ఎవరు ఎన్ని అనుకున్నా.. ఎంతలా కిందకు లాగాలని చూసినా సరే.. స్వశక్తిని నమ్ముకుని.. జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరిన మహిళలు ఎందరో ఉన్నారు. ఇక డబ్బు సంపాదన అంటే కేవలం మగవారు మాత్రమే అనుకునే స్థాయి నుంచి.. వారికి ధీటుగా కోట్ల రూపాయల వ్యాపార సామ్రాజ్యాలను నడిపిస్తూ.. బిలియనీర్లుగా ఎదిగిన మహిళలు నేడు మన సమాజంలో కోకొల్లలు. ఈ క్రమంలో భారత్‌లో అత్యంత సంపన్న మహిళల జాబితాను హురున్, కొటక్ ప్రైవేట్ బ్యాంకింగ్ కలిసి విడుదల చేశాయి. ఈ లిస్టులో టెక్ దిగ్గజం హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ లిమిటెడ్ ఛైర్‌పర్సన్ రోష్ని నాడార్ మల్హోత్రా తొలి స్థానంలో నిలిచారు. 2021లో రూ.84,330 కోట్ల సంపదతో రోష్ని నాడార్‌కు భారత్‌లో అత్యంత సంపన్న మహిళ స్థానం దక్కింది.
భారత్‌లో టాప్ 100 సంపన్న మహిళలతో ఈ జాబితాను హురున్- కొటక్ ప్రైవేట్ బ్యాంకింగ్ కలిసి విడుదల చేశాయి. ఈ జాబితాలో వరుసగా రెండో ఏడాది తొలి స్థానంలో నిలిచారు రోష్ని నాడార్. 2021లో రోష్ని నాడార్ సంపద 54 శాతం పెరిగింది. రోష్ని నాడార్ నేతృత్వంలో హెచ్‌సీఎల్ టెక్ రూ.13,740 కోట్ల విలువైన ఐబీఎం ప్రొడక్టులను కొనుగోలు చేసింది. చరిత్రలోనే ఇవి అతిపెద్ద డీల్స్. రోష్ని నాడార్ తర్వాత ఈ జాబితాలో నైకా ఫౌండర్ ఫల్గుణి నాయర్ రెండో స్థానంలో ఉన్నారు. ఆమె సంపద రూ.57,520 కోట్లుగా ఉంది. గత నవంబర్‌లోనే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్‌లో అడుగు పెట్టిన ఫల్గుణి నాయర్ కంపెనీ నైకా.. బంపర్ లిస్టింగ్ సాధించింది.
అంతకుముందు ఏడాది నాయర్ తొమ్మిదవ స్థానంలో ఉంటే.. ప్రస్తుతం రెండో ర్యాంకును సాధించారు. బయోకాన్ బాస్ కిరణ్ మజుందర్ షాను వెనక్కి నెట్టేసి మరీ ఆమె ఈ స్థానాన్ని సంపాదించుకున్నారు. కిరణ్ మజుందర్ షా ఈ జాబితాలో రూ.29,030 కోట్లతో మూడో స్థానంలో ఉన్నారు. కిరణ్ మజుందర్ షా సంపద 21 శాతం తగ్గిపోయిందని హురున్ లిస్టు పేర్కొంది. ఈ ఏడాది టాప్ 10 లిస్టులో ఇద్దరు కొత్త వారు చోటు దక్కించుకున్నారని హురున్ పేర్కొంది. మరి ఈ మహిళామణులు సాధించిన విజయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.