కేంద్రం తీసుకువచ్చే నూతన విధానం ద్వారా గ్యాస్ ధరలు తగ్గుతాయని కొన్ని రోజుల క్రితం ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా నూతన విధి విధానాలు అమల్లోకి వచ్చాయి. ఈ క్రమంలో గ్యాస్ కంపెనీలు గ్యాస్ ధరలు తగ్గించాయి. ఆ వివరాలు..
నెల ప్రారంభం అయ్యింది అంటే చాలు.. గ్యాస్ ధరలు సామాన్యులను భయపెడుతుంటాయి. గత కొంత కాలంగా గ్యాస్ ధరలు పెరగడమే కానీ.. తగ్గింది లేదు. ఒకవేళ తగ్గినా కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలు మాత్రమే తగ్గుతున్నాయి. ఇక అంతర్జాతీయ పరిణామాలతో సంబంధం లేకుండా గ్యాస్ ధరలను స్థిరికరించే దిశగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోబోతున్నట్లు ప్రకటించింది. దానిలో భాగంగానే గ్యాస్ ధరలకు సంబంధించి ప్రభుత్వం కొత్త పద్దతిని తీసుకువచ్చింది. ఈ క్రమంలో పలు గ్యాస్ కంపెనీలు.. ధరలను తగ్గించాయి. అవి నేటి నుంచే అమల్లోకి వచ్చాయి. మరి ఇంతకు ఏ కంపెనీలు గ్యాస్ ధర తగ్గించాయి.. ఎంత తగ్గించాయి అంటే..
కేంద్ర నిర్ణయం వల్ల నేచురల్ గ్యాస్ ధరలు తగ్గాయి. ఈ క్రమంలో అదానీ గ్రూప్‌కు చెందిన అదానీ టోట్ గ్యాస్ లిమిటెడ్.. కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ (సీఎన్‌జీ) ధర కేజీ మీద రూ.8.13 తగ్గించింది. అలానే పైప్డ్ నేచురల్ గ్యాస్ (పీఎన్‌జీ) ధర స్టాండర్డ్ క్యూబిక్ మీటర్‌కు 5.06 రూపాయల మేర తగ్గించింది. తగ్గిన గ్యాస్ ధరలు నేటి నుంచి అనగా ఏప్రిల్ 8 నుంచి అమల్లోకి రానున్నాయి. అలానే మహానగర్ గ్యాస్ లిమిటెడ్ కూడా ఏప్రిల్ 7 న అనగా శుక్రవారం సీఎన్‌జీ, పీఎన్‌జీ ధరల్ని తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ కంపెనీ సీఎన్‌జీ ధరను కిలోపై రూ.8 తగ్గించడంతో.. ప్రస్తుతం దీని ధర రూ.79కి చేరింది. మరోవైపు పీఎన్‌జీ ధర స్టాండర్డ్ క్యూబిక్ మీటర్‌కు ఇప్పుడు రూ.49కి చేరింది.
సహజ వాయువు ధరల్ని మి. బ్రిటిష్ యూనిట్‌కు 7.92 డాలర్లుగా కేంద్రం నిర్ణయించింది. ఇది ఏప్రిల్ 30 వరకు అమల్లో ఉంటుంది. కేంద్రం నిర్ణయించిన ఈ ధరను వినియోగదారులకు 6.5 డాలర్లకే పరిమితం చేసినట్లు చమురు మంత్రిత్వ శాఖకు చెందిన పెట్రోలియం ప్లానింగ్, అనాలిసిస్ సెల్ వెల్లడించాయి. ఇక కొత్త ధరలను నిర్ణయించిన విధానం ప్రకారం.. ముడి చమురు దిగుమతి వ్యయాల్లో 10 శాతాన్ని సహజవాయువు ధరగా ప్రకటిస్తున్నారు. ఇక ధరల నిర్ణయ విధానంలో మార్పులు చేస్తూనే.. 2025, మార్చి 31 వరకు వినియోగదారులకు సహజవాయువు ఎంఎంబీటూయూ ధరను 6.5 డాలర్లకు పరిమితం చేసింది కేంద్రం. దీంతో ప్రస్తుత ధర కంటే గరిష్ట ధరపై విధించిన పరిమితి 25 శాతం వరకు తక్కువ ఉంటుంది. దీని వల్ల సీఎన్‌జీ, పీఎన్‌జీ ధరలు 10 శాతం తగ్గుతాయి.