కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అనేక పథకాల్లో పీఎం కిసాన్ సమ్మాన్ యోజన ఒకటి. అన్నదాతలను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం 2019లో ఈ పథకం తీసుకొచ్చింది. ఈ పథకం కింది ప్రతి సంవత్సరం రైతులకు రూ. 6 వేలను పెట్టుబడి సాయంగా అందిస్తున్నారు. ఈ మొత్తాన్ని మూడు విడతల్లో అంటే నాలుగు నెలలకు ఒక్కసారి రూ.2 వేల చొప్పున అన్నదాతల ఖాతాల్లో జమా చేస్తారు. ఇప్పటికే 11 విడతలుగా రూ.22 వేలు అన్నదాత బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు. ఇప్పుడు 12వ విడత డబ్బులు జమ కావాల్సి ఉంది.
పీఎం కిసాన్ 12వ విడత సొమ్ము సెప్టెంబర్ 30 వరకు ఖాతాల్లోకి రావచ్చని సమాచారం. అయితే ఈకేవైసీ చేసుకున్న వారికే 12 విడత డబ్బులు వస్తాయని కేంద్రం స్పష్టం చేసింది. ఈ కారణంగానే 12వ విడత డబ్బులు ఆలస్యమైనట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతానికి ఈ-కేవైసీ గడువు ఆగస్టు 31తో ముగిసింది. 12వ విడత డబ్బులు ఖాతాల్లో జమ అయ్యాక, మరోసారి గడవు ఇచ్చే అవకాశం ఉంది.
ఆధార్ కీలకం
పీఎం కిసాన్ డబ్బులు, మీ ఖాతాల్లో క్రమం తప్పకుండా జమ కావాలంటే.. బ్యాంకు అకౌంట్ తో ఆధార్ లింకింగ్ తప్పనిసరి. ఎందుకంటే ఆ బ్యాంక్ బ్రాంచ్‌లో డబ్బును జమ చేస్తారు. రైతులు తమ వివరాలు సరిగ్గా ఉన్నాయో లేదో https://pmkisan.gov.in/ వెబ్‌సైట్‌లో కూడా తెలుసుకోవచ్చు. అన్నీ కరెక్ట్‌గా ఉంటే పీఎం కిసాన్ డబ్బులు జమ అవుతాయి. వివరాల్లో తప్పులు ఉంటే వెబ్‌సైట్‌లోనే మార్పులు చేసుకునే అవకాశం ఉంది.