సిరి హన్మంత్.. షార్ట్ ఫిల్మ్, యూట్యూబ్ సిరీస్‌ల ద్వారా గుర్తింపు తెచ్చుకుంది. అలా సీరియల్స్, సినిమాల్లో కూడా అవకాశాలు అంది పుచ్చుకుంది. ఆ తర్వాత.. బిగ్‌బాస్ 5లో కంటెస్టెంట్‌గా పాల్గొంది. అయితే బిగ్‌బాస్ హౌస్‌లోకి వెళ్లడానికి ముందు వరకు జనాల్లో .. సిరి మీద మంచి అభిప్రాయం ఉండేది. కానీ హౌస్‌లో షణ్ముఖ్‌తో ఆమె ప్రవర్తించిన తీరు, ముద్దులు, హగ్గులు అంటూ హద్దులు మీరి ప్రవర్తించడంతో.. ఆడియెన్స్ ఆమె పట్ల విపరీతమైన వ్యతిరేకత పెంచుకున్నారు. ఆఖరికి సిరి, షణ్ముఖ్‌ల కుటుంబ సభ్యులు కూడా వారి ప్రవర్తనను తప్పు పట్టారు. ఈ క్రమంలో బాయ్ ఫ్రెండ్.. శ్రీహాన్ బిగ్‌బాస్ స్టేజీ మీదకు రాగానే.. సిరి అతడికి ముఖం చూపించలేకపోవడం.. ఆ తర్వాత శ్రీహాన్.. సిరి నన్ను వదిలేస్తున్నావా.. బయట నీకోసం నేనొకడిని ఉన్నాను అంటూ చెప్పిన డైలాగ్ ప్రతి ఒక్కరిని కదిలించింది.
అప్పటి వరకు అసలు శ్రీహాన్ గురించి చాలా మందికి తెలియదు. ఈ ఒక్క ఎపిసోడ్‌తో.. శ్రీహాన్ మీద.. నెటిజనుల్లో విపరీతమైన క్రేజ్ పెరిగింది. ఇంత మంచి వ్యక్తిని ప్రేమిస్తూ.. ఆ కక్కుర్తి పనులు ఏంటని చాలా మంది సిరి మీద ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక బిగ్‌బాస్ హౌస్ నుంచి వచ్చిన తర్వాత.. సిరి-శ్రీహాన్ విడిపోతారని.. చాలా మంది భావించారు. కానీ వారిద్దరు.. తమ మధ్య వచ్చిన అభిప్రాయబేధాలను పరిష్కరించుకుని.. ముందుకన్నా బలంగా తమ బంధాన్ని మార్చుకున్నారు.
ఈ క్రమంలో తాజాగా సిరి హన్మంత్.. అరియానా హోస్ట్ చేసే.. బిగ్‌బాస్ కెఫెలో సందడి చేసింది. ఈ సందర్భంగా సిరి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించింది. ముందుగా ప్రస్తుతం బిగ్‌బాస్ హౌస్‌లో శ్రీహాన్ ఆటతీరు గురించి తన అభిప్రాయాలు చెప్పుకొచ్చింది సిరి హన్మంత్. ‘‘ఇంట్లో శ్రీహాన్‌కి ఎవరు బెస్ట్ ఫ్రెండ్ ట్యాగ్ ఇవ్వలేదు. అది చూసి నాకే చాలా బాధ అనిపించింది. ఇక శ్రీహాన్ ఎంత బాధ పడతాడో నేను ఊహించగలను. కానీ త్వరగానే దాన్నుంచి బయటపడతాడు’’ అని చెప్పుకొచ్చింది.
‘‘ఇక చాలా మంది మా కొడుకు గురించి అడుగుతున్నారు. వాస్తవంగా చెప్పాలంటే.. తను మా మావయ్య కొడుకు. కరోనా సమయంలో మేం వైజాగ్ వెళ్లాం. అప్పుడు బాబు మాకు బాగా దగ్గరయ్యాడు. మావయ్యకు అనారోగ్యం, ఆర్థిక స్థితి బాగాలేకపోవడంతో.. బాబుని మేమే తెచ్చేసుకుని.. పెంచుకుంటున్నాం. శ్రీహాన్ కూడా అందుకు అంగీకరించాడు. ఇక ఏడాదిలోపు మేం వివాహం చేసుకుంటాం’’ అన్నది.
ఇక బిగ్‌బాస్ 5 తర్వాత.. తమ ఇద్దరి మధ్య చోటు చేసుకున్న అనేక సంఘటనల గురించి చెప్పుకొచ్చింది సిరి. ‘‘బిగ్‌బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చాక మా మధ్య చాలా గొడవలు జరిగాయి. బ్రేకప్ వరకూ వెళ్లాం. శ్రీహాన్ నన్ను వదిలి వెళ్లాడు. ఆ సమయంలో నాకు కోవిడ్ వచ్చింది. ఎవరికీ కనిపించకుండా.. అందరికి దూరంగా వెళ్లిపోదామనుకున్నాను. ఫోన్ కూడా స్విచ్ఛాఫ్ చేశాను. ఇక చెప్పులు కూడా లేకుండా రోడ్లు మీద తిరిగాను. మధ్యలో ఒకసారి ఫోన్ ఆన్ చేయగానే.. శ్రీహాన్ నుంచి మెసేజ్‌లు, మిస్డ్ కాల్ అలర్ట్స్ ఉన్నాయి’’ అని గుర్తు చేసుకుంది.
‘‘ఇప్పుడు నా ఫోన్ ఎత్తకపోతే.. ఇక జీవితంలో కనిపించను అంటూ శ్రీహాన్ మెసేజ్ చేశాడు. అది చూడగానే.. వెంటనే తనకు కాల్ చేశాను. నేను ఎక్కడ ఉన్నది తెలుసుకుని.. వెంటనే అక్కడకు వచ్చి.. రోడ్ల మీద తిరుగుతున్న నన్ను ఇంటికి తీసుకెళ్లాడు. అలా మా మధ్య చాలా జరిగాయి. అయితే.. అదృష్టం కొద్ది.. ఈ సంఘటనలన్నింటి తర్వాత మా మధ్య బంధం చాలా బలపడింది.. ఇప్పుడు మేము ఎప్పటికి విడిపోనంత దగ్గరయ్యాం’’ అని చెప్పుకొచ్చింది సిరి. ప్రసుత్తం ఈ వీడియో వైరలవుతోంది.