ఈసారి బిగ్ బాస్ లో చెప్పుకోదగ్గ కంటెస్టెంట్స్ ఎవరూ లేరు. ఉన్నదల్లా గీతూ, రేవంత్ లాంటి వారు మాత్రమే. వీరిలో గీతూని గత వారం ఎలిమినేట్ చేసేశారు. సాధారణంగా బిగ్ బాస్ గెలిచినా, ఎలిమినేట్ అయినా సరే ఇంటర్వ్యూలు, పార్టీలు అని తెగ హడావుడి చేస్తారు. కానీ గీతూ మాత్రం చాలా సైలెంట్ గా ఉండిపోయింది. దీంతో ఆమె అజ్ఞాతంలోకి వెళ్లిపోయిందని తెగ మాట్లాడుకున్నారు. కానీ ఆమె ఇంకా ఎలిమినేషన్ బాధ నుంచి బయటకొచ్చినట్లు కనిపించట్లేదు. ఎందుకంటే ఏడుస్తూ పోస్ట్ పెట్టిన వీడియోనే దానికి ఉదాహరణ.
ఇక వివరాల్లోకి వెళ్తే.. గత సీజన్లతో పోలిస్తే ఈసారి బిగ్ బాస్ ఏమంత ఇంట్రెస్టింగ్ గా లేదు. అయినా సరే షో చాలామంది చూస్తున్నారు అంటే అది గీతూ రాయల్ అనే అమ్మాయి వల్ల. తొలి ఎపిసోడ్ నుంచే ఫుల్ ఎనర్జీ చూపిస్తూ, అందరినీ డామినేట్ చేసేసింది. బిగ్ బాస్ కూడా ఏం అనలేకపోయాడు. ఈమెని చూసి మిగతా కంటెస్టెంట్స్ కూడా తెగ భయపడ్డారు! అలా ప్రారంభ ఎపిసోడ్ నుంచి గత వారం వరకు గీతూ ఆడిందే ఆట అన్నట్లు జరిగింది. కానీ ఏదైనా సరే ఓ లిమిట్ ఉంటుంది కదా. బహుశా దాన్ని గీతూ క్రాస్ చేసినట్లుంది. అందుకే బిగ్ బాస్ ఆమెని హౌస్ నుంచి ఎలిమినేట్ చేసి పంపేశాడు.
ఇక హౌసుని వీడే ముందు కూడా ‘నన్ను పంపించొద్దు బిగ్ బాస్’ అని ఏడ్చిన తీరు ప్రతి ఒక్కరిని కదలించింది. చివరకు ఇష్టం లేకపోయినా సరే బిగ్ బాస్ నుంచి బయటకొచ్చేసింది. అయితే ఎలిమినేట్ అయి ఇన్నిరోజులు అవుతున్నా సరే ఆమె బయటకు రాలేదు. బిగ్ బాస్ బజ్ ఇంటర్వ్యూ తప్పించి ఎవరికీ ఇంటర్వ్యూ కూడా ఇవ్వలేదు. దీంతో ఆమె అజ్ఞాతంలోకి వెళ్లిపోయిందన్నారు. కానీ ఆ రూమర్స్ కి ఎండ్ కార్డ్ వేస్తూ తన యూట్యూబ్ ఛానెల్ లో వీడియో పోస్ట్ చేసింది. ఏ పరిస్థితుల్లో హౌస్ నుంచి బయటకు రావాల్సి వచ్చింది? బిగ్ బాస్ ప్రయాణంలో తాను నేర్చుకున్న గుణపాఠాలు ఏంటి అనే వాటిపై దాదాపు గంటపాటు మాట్లాడింది.
‘బిగ్ బాస్ హౌసులోకి వెళ్లేముందు నన్ను ప్రమోట్ చేయమని కొందరికి రూ.25 వేలు ఇచ్చాను. వారు ఏ పని చేయకుండా డబ్బులు తీసుకుని మోసం చేశారు. నా గురించి ఒక్కటంటే ఒక్క పాజిటివ్ కామెంట్ చేయలేదు. నమ్మిన ఫ్రెండ్స్ కూడా నన్ను మోసం చేశారు. వారందరూ నాకు సపోర్ట్ ఇస్తారనే ధైర్యంతో హాసులోకి అడుగుపెట్టాను. కానీ ఏ ఒక్కరి నుంచి నాకు మద్ధతు రాలేదని బయటకు వచ్చాక తెలిసింది. నిజంగా ఇది నన్ను చాలా బాధపెట్టింది. నా గేమ్ ను తప్పు పడుతున్నారు. అభిజిత్, కౌశల్ కంటే నేనేం తక్కువ? వాళ్లు చేస్తే రైట్, నేను చేస్తే తప్పా?’ అని గీతూ ఏడుస్తూ వీడియో పోస్ట్ చేసింది. ఇప్పుడు ఇది కాస్త వైరల్ గా మారింది.