పైకి వెళ్తున్న లిఫ్ట్, వైరు తెగిపడటంతో వాయువేగంతో కిందకు వచ్చి పడిపోయింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు..
ఆంధ్రప్రదేశ్‌లోని ఎన్టీఆర్ జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఇబ్రహీంపట్నంలోని విజయవాడ థర్మల్ పవర్ స్టేషన్ (వీటీపీసీ)లో లిఫ్ట్ వైరు తెగింది. దీంతో లిఫ్ట్ ఊడి కిందకు పడిపోయింది. ఈ ఘటనలో ముగ్గురు చనిపోయారు. మిగిలినవారికి గాయాలయ్యాయి. గాయాలపాలైన వారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాద సమయంలో లిఫ్ట్‌లో 8 మంది ఉన్నట్లు తెలుస్తోంది. ఓవర్ లోడ్ కారణంగానే ఈ ఘటన జరిగిందని అంటున్నారు. చనిపోయిన కార్మికుల మృతదేహాలను వీటీపీఎస్ బోర్డు ఆస్పత్రికి తరలించారు.
వీటీపీఎస్ ప్రమాదంలో మృతి చెందిన వారిని జార్ఖండ్‌కు చెందిన కాంట్రాక్ట్ కార్మికులుగా అధికారులు గుర్తించారు. వీటీపీఎస్‌లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ప్రమాదంపై అధికారులు ఆరా తీస్తున్నారు. మరోవైపు వీటీపీఎస్ యాజమాన్య నిర్లక్ష్య ధోరణి వల్లే ప్రమాదం జరిగిందంటూ తెలుగు దేశం పార్టీ, జనసేన నేతలు బోర్డు ఆస్పత్రి వద్ద నిరసన వ్యక్తం చేశారు. వెంటనే వీటీపీఎస్, పవర్ మేక్ కంపెనీల అధికారులు బోర్డు ఆస్పత్రి దగ్గరకు వచ్చి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. మృతుల కుటుంబాలకు తగిన న్యాయం చేయాలన్నారు.