ప్రేమ.. ప్రేమికుల రోజు అనగానే మనకు వెంటనే గుర్తుకు వచ్చేది.. ఆగ్రాలోని తాజ్ మహల్. భార్య ముంతాజ్ మీద ప్రేమకు ప్రతిరూపంగా షాజహాన్ నిర్మించిన తాజ్ మహల్ ప్రంపంచ వింతల జాబితాలో చేరి.. దేశ విదేశాల పర్యాటకులను ఆకర్షిస్తోంది. ఈ భూమ్మీద ప్రేమకు నిలయంగా నిలిచిన వాటిల్లో తాజ్ మహల్ అతి ముఖ్యమైనది. అయితే తాజ్ మహల్ అనగానే ఎవరికైనా ఆగ్రా గుర్తుకు వస్తుంది.. కానీ మన ఏపీ, వైజాగ్ లో కూడా తాజ్ మహల్ ఉందని మీకు తెలుసా. భార్యపై ప్రేమతో ఆమె మరణాంతరం ఒక జమీందారు.. వైజాగ్ లో దీన్ని నిర్మించారు. షాజహన్ తన భార్యపై ప్రేమతో యమునా తీరంలో తాజ్ మహల్ కట్టిస్తే, కురుపాం రాజు తన భార్య జ్ఞాపకార్థం విశాఖ సాగర తీరంలో ఈ ప్రేమ మందిరాన్ని నిర్మించారు. ఆ వివరాలు..’
వైజాగ్ తాజ్ మహల్ చరిత్ర..
అనకాపల్లి జమీందారు గోడే నారాయణ గజపతిరావు రెండవ కుమార్తె రాణి లక్ష్మీ నరస్సాయమ్మ పట్టమహాదేవి, కురుపాం జమీందారు రాజా వైరిచెర్ల వీరభద్ర బహదూర్‌కు 1895లో వివాహం జరిగింది. తర్వాత ఏడేళ్లకు ఆమె మరణించారు. పెళ్లికి ముందు ఒకరికి ఒకరు తెలియకపోయినా, వివాహానంతరం ప్రేమికుల్లానే బతికారు. సంతోషంగా సాగుతున్న వారి కాపురాన్ని చూసి.. విధికి కన్ను కుట్టింది. ముగ్గురు పిల్లలు పుట్టిన తర్వాత ఆమె హఠాత్తుగా మరణించారు. రాణి లక్ష్మీ నరస్సాయమ్మ మరణాన్ని వీరభద్ర బహదూర్ జీర్ణించుకోలేకపోయారు. ఆ బాధతో చాలా రోజుల పాటు కోట నుంచి బయటకు రాక.. ప్రజలెవరికీ కనిపించలేదు. నిరంతరం రాణి లక్ష్మీ నరస్సాయమ్మ ఆలోచనలతోనే గడిపారు. ఆ ఆలోచనల్లో నుంచి పుట్టిందే ఈ కట్టడం. ఇప్పుడు అందరూ దీన్ని ‘వైజాగ్ తాజ్‌మహల్’ అంటూ గొప్పగా చెప్పుకుంటున్నారు.
ఈ కట్టడాన్ని అంతా వైజాగ్ తాజ్‌మహల్ అంటారుగానీ, దీనికి రాజ వీరభద్ర బహదూర్ పెట్టిన పేరు వేరే ఉంది. దీని అసలు పేరు ‘ప్రేమ నివేదన రూపం’. ఈ ప్రేమ మందిరంలో రెండున్నర అడుగల ఎత్తున రాణి విగ్రహాం కూడా ఉండేది. అయితే దానిని 30 ఏళ్ల క్రితమే ఎవరో ఎత్తుకెళ్లిపోవడం, ఈ నిర్మాణం చుట్టు పక్కలంతా తుప్పలు, పొదలు పెరిగిపోవడంతో టూరిస్టుల సంఖ్య తగ్గింది. బాల చందర్ మరో చరిత్ర సినిమాలో కూడా ఇది కనిపిస్తుంది.
ప్రస్తుతం దీన్ని ఎవరు పట్టించుకోకపోవడంతో.. ఇప్పుడు అనాథలా మిగిలిపోయింది. అయితే త్వరలోనే దీనికి మరమత్తులు చేయించి.. రాణి విగ్రహం ప్రతిష్టించి.. మునుపటి వైభవాన్ని తీసుకువస్తామని.. సంస్థానానికి చెందిన వారు ప్రకటించారు. ప్రేమికుల రోజున మీకు వీలైతే.. ఓ సారి ఈ వైజాగ్ తాజ్ మహల్ ని సందర్శించండి. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.