వరి కోస్తుండగా వరి కోత యంత్రంలో చిక్కుకొని భారీ తాచు పాము తీవ్రంగా గాయపడింది. అలా గాయంతో నిస్సహాయ స్థితిలో ఉన్న పాము చుట్టు స్థానికులు చేరారు. గాయపడిన పామును చంపకుండా ఆ గ్రామస్థులు ఓ మంచి పని చేశారు. వారు చేసిన పనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
సాధారణంగా పాములు కనిపిస్తే ఎవరికైనా వణుకు పుడుతుంది. ఆ పాము కనిపించిన ప్రాంతం నుంచి దూరంగా పరుగులు తీస్తారు. కొందరు అయితే కాస్తా ధైర్యం చేసి ఆ పామును వెంటపడి మరీ చంపేస్తారు. అలాంటిది గాయాలతో పాము కనిపిస్తే ఇంకేమైనా ఉందా?. కొందరు దొరికింది కదా.. అని దారుణంగా కొట్టి కొట్టి చంపేస్తారు. దెబ్బ తగిలిన పాము కనపడితే రక్షించే వాళ్లు చాలా అరుదుగా కనిపిస్తుంటారు. తాజాగా అలాంటి అరుదైన దృశ్యం అంబేద్కర్ కోనసీమ జిల్లాలో చోటుచేసుకుంది. వరికోత మిషన్ లో పడి.. గాయపడిన పాముకు కట్టుకట్టి స్థానికులు కాపాడారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
ఆంధ్రప్రదేశ్ లోని అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో ఉప్పలగుప్తం మండలం సింగరాయపాలెం గ్రామంలో ఓ భారీ తాచుపాము వరికోత కోస్తుండగా మిషన్ లో పడింది. దాదాపు నాలుగైదు రోజులుగా గాయాలతో ఆ పాము విలవిల్లాడింది. అంతేకాక తీవ్ర గాయాలతో ఎక్కడి కదల్లేక బాధతో అక్కడే ఉండి పోయింది. అలా నిస్సహాయ స్థితిలో ఉన్న పాము వద్దకు చీమలు కూడా వచ్చి చేరేవి. దీంతో ఆ పాము మరింత నొప్పితో విలవిల్లాడిపోయింది. అయితే దీన్ని గమనించిన స్థానికులు స్నేక్ క్యాచర్, వైద్యుడికి సమాచారమిచ్చారు. దీంతో స్నేక్ క్యాచర్ గణేష్ వర్మ సాయంతో వైద్యుడు రమేష్ ఆ విషసర్పానికి ఆపరేషన్ చేశారు. అనంతరం గాయపడిన ప్రాంతంలో కట్టుకట్టి పామును జాగ్రత్తగా చూసుకున్నారు.
పాము కాస్త కోలుకున్న అనంతరం.. సురక్షిత ప్రాంతంలో విడిచిపెట్టారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అలానే పామును కాపాడిన గ్రామస్థులు, స్నేక్ క్యాచర్, డాక్టర్ రమేశ్ పై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. మూగ ప్రాణులపై ప్రేమను చూపిస్తున్న ఇలాంటి మానవత వాదులకు సలాం అంటూ కొందరు అభినందిస్తున్నారు. విష సర్పమని తెలిసిన కూడా కాపాడిన తీరు వారి మంచితనానికి నిదర్శనమని మరి కొందరు ప్రశంసిస్తున్నారు. మరి.. వైరల్ అవుతున్న ఈ వీడియోను మీరు వీక్షించి.. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.