నేటికాలంలో అక్రమ సంబంధాలు బాగా పెరిగిపోతున్నాయి. ఈ వివాహేతర బంధాలు పచ్చని సంసారాల్లో నిప్పులు పోస్తున్నాయి. పరాయి శరీరం కోసం భాగస్వామిపై దారుణాలకు ఒడిగడుతున్నారు. మరికొందరు.. తమ భాగస్వామి పరాయి వారితో వివాహేతరం సంబంధం పెట్టుకున్నారని తెలిసి మనస్తాపంతో దారుణ నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో వారు చావడం లేదా భాగస్వామిని చంపడం చేస్తున్నారు. తాజాగా అలాంటి ఘటన ఒకటి జరిగింది. నెలల పాపతో హాయిగా సాగుతున్న ఓ దంపతుల సంసారంలో వివాహేతర సంబంధం చిచ్చు పెట్టింది. ఈ అక్రమ సంబంధం కారణంగా చివరకు వారిద్దరి మధ్య తీవ్రస్థాయిలో గొడవలు జరిగి.. ఒకరి ప్రాణం బలైంది. ఈ ఘటన పశ్చిమ గోదావరి జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం…
పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డి గూడెం మండలంలోని ఎ. పోలవరం గ్రామానికి చెందిన వనపర్తి సతీష్ తో అదే గ్రామానికి చెందిన దేవి(21) అనే యువతితో ఏడాది క్రితం వివాహం జరిగింది. ప్రస్తుతం వీరికి ఏడు నెలల పాప ఉంది. పెళ్లైన కొన్ని నెలల పాటు దేవితో సతీష్ ఎంతో ప్రేమగా ఉండే వాడు. అయితే కొంతకాలం తరువాత సతీష్ బుద్ధి పెడదారి పట్టింది. స్థానికంగా ఉండే ఓ మహిళతో సతీష్ వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. పరాయి మహిళ మోజులో పడ్డ సతీష్.. దేవిని నిర్లక్ష్యం చేసేవాడు. ఈ వివాహేతర సంబంధం కారణంగానే ఈ దంపతుల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. మూడు రోజుల కిందట మరోసారి వారిద్దరి మధ్య గొడవ జరిగింది.
ఇదే సమయంలో కోపంతో సతీష్.. దేవిని కొట్టాడు. భర్త కొట్టడంతో మనస్తాపం చెందిన దేవి.. బుధవారం విషంతో కూడిన మందు తాగింది. విషం తాగిన దేవిని గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే జంగారెడ్డిగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ దేవి మృతిచెందింది. అయితే దేవి మృతిపై ఆమె బంధువులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దేవి భర్త సతీష్ బలవంతంగా మందు పోసి హత్య చేశాడని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై మృతురాలి సోదరి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరి.. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.