గత కొంత కాలంగా దేశ వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల సంఖ్య విపరీతంగా పెరిగిపోతున్నాయి. ప్రతిరోజూ ఎక్కడో అక్కడ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి.. పదుల సంఖ్యల్లో మరణాలు సంబవిస్తున్నాయి. ప్రభుత్వాలు ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నా.. ప్రమాదాలను మాత్రం అరికట్టలేకపోతున్నారు. తిరుపతిలో రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. శ్రీకాళహస్తిలో రేణిగుంట-నాయుడుపేట ప్రధాన రహదారిపై లారీ- టెంపో వాహనం ఢీకొన్నాయి.
తిరుపతి జిల్లా చంద్రగిరికి చెందిన ఒక మినీ వ్యాన్ లో 12 మంది నాయుడుపేట సమీపంలోని కనుపూరుమ్మ ఆలయాన్ని దర్శించుకుని తిరుగు ప్రయాణంలో తిరుపతికి బయల్దేరారు. శ్రీకాళహస్తి అర్ధనారీశ్వరస్వామి ఆలయం సమీపంలో ఎదురుగా వచ్చిన లారీ వీరి వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందగా మరో ఎనిమిది మందికి తీవ్ర గాయాలు అయ్యాయి.
ప్రమాదం గురించి తెలిసిన స్థానికులు వెంటనే గాయపడినవారిని శ్రీకాళహస్తి ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం తిరుపతికి తరలించారు. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.