ఇంగ్లీష్.. మన జీవితాలను ఎంత ప్రభావితం చేస్తుందో.. ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్న ఎవరిని అడిగినా చెప్తారు. మనలో ఎంత టాలెంట్ ఉన్నా సరే.. దాన్ని అవసరమైన చోట ప్రదర్శించలేకపోతే వృధా అవుతుంది. మరీ ముఖ్యంగా ఇంటర్వ్యూల్లో చాలా మందికి ఎదురయ్యే పరిస్థితి ఏంటి అంటే.. తమను అడిగే ప్రశ్నలకు సమాధానం తెలుసు.. కానీ దాన్ని ఇంగ్లీష్‌లో ఎలా వ్యక్త పరచాలో తెలియదు. ఆ నిమిషం భయంతో బిగుసుకుపోతాం.. గొంతు పెగలదు. ఎక్కడా లేని కంగారు వస్తుంది. ఆ ఒక్క క్షణమే మన భవిషత్తుని నిర్ణయిస్తుంది. ఇంటర్వ్యూ చేసే వారు.. మనం అన్‌ఫిట్ అని తేల్చేస్తారు. ఇలా రెండు, మూడు సంఘటనలు చోటు చేసుకుంటే చాలు.. ఇక మనకు ఉద్యోగం రాదు.. జీవితం వృధా అనే భావన కలుగుతుంది.
ఆ పరిస్థితి మారాలంటే.. చిన్నప్పటి నుంచే ఇంగ్లీష్ మన జీవితంలో భాగం కావాలి. చదువుతో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా పెరగాలి. కానీ ప్రస్తుతం ‘‘చదువుకోనే’’ రోజులు. ఇంగ్లీష్ రావాలంటే ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల్లో చేర్పించాలి. అది ఎంత ఖర్చుతో కూడుకున్న వ్యవహారమే ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
మరి పేదింటి పిల్లల పరిస్థితి ఏంటి..? అంటే వారిలో ఎంత ప్రతిభ ఉన్నా సరే.. ఇలా జీవితాంతం ఇంగ్లీష్ రాదని భయపడుతూ.. భవిష్యత్తును నాశనం చేసుకోవాలా..? వారెందుకు ఇంగ్లీష్ నేర్చుకోకూడదు..? ఇలానే పేదింటి విద్యార్థుల గురించి ఆలోచించారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మాధ్యమాన్ని ప్రవేశపెట్టడం అలా వచ్చిన ఆలోచనే.
ఇంగ్లీష్ మీడియం ప్రారంభించిన కొత్తలో విద్యార్థులు కాస్త ఇబ్బంది పడతారేమో. అప్పటి వరకు తెలుగు మీడియంలో చదవడం వల్ల పాఠాలు అర్థం చేసుకోవడానికి ఇబ్బంది పడతారు. తొలి ఏడాది పరీక్షల్లో కాస్త మార్కులు తగ్గుతాయేమో. కానీ పోను పోను ఇంగ్లీష్ వారికి అలవాటు అవుతుంది. ఆంగ్లం అంటే భయం పోతుంది. విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. భవిష్యత్తు గురించి భరోసా కలుగుతుందని ఆలోచించిన సీఎం జగన్.. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం తప్పని సరి చేశారు.
కానీ ఈ నిర్ణయంపై రాష్ట్రంలోని ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున విమర్శలు చేశాయి. విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేస్తున్నారని విమర్శించాయి. ఏ ఒక్క పార్టీ కూడా ఈ నిర్ణయం వల్ల భవిష్యత్తులో విద్యార్థులకు కలగబోయే మేలు గురించి ఆలోచించలేదు.. అన్ని పార్టీలు ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించాయి. కానీ ఎందరు ఎన్ని విమర్శలు చేసినా సరే.. విద్యార్థుల భవిష్యత్తుకు మేలు చేసే మంచి పని కోసం సీఎం జగన్ మొండిగా ముందుకెళ్లారు. ఆ ఫలితాలు నేడు కనిపిస్తున్నాయి.
ఊదాహరణకు కాకినాడ జిల్లా, బెండపూడి ప్రభుత్వ పాఠశాలను తీసుకుంటే.. కొన్నేళ్ల క్రితం వరకు అక్కడ చదువుకునే పిల్లలకు ఇంగ్లీష్ పాఠాలు కూడా వచ్చేవి కావేమో. మరి నేడు.. ఏకంగా కార్పొరేట్ స్కూల్లో చదివే పిల్లలు మాట్లాడే స్టైల్లో ఇంగ్లీష్‌లో అదరగొడుతున్నారు. ఆ చిన్నారుల్లో కనిపిస్తున్న ఆత్మవిశ్వాసం, భరోసా చాలు.. రాబోయే రోజుల్లో ఈ ప్రయత్నం ఎంత విజయవంతం అవుతుందో చెప్పడానికి.
ఇక బెండపూడిలానే ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు ఇంగ్లీష్ మీద ఇంత పట్టు సాధిస్తే.. ఇక వారి భవిష్యత్తుకు ఢోకా ఉండదు. అంతులేని ఆత్మవిశ్వాసంతో ఏ రంగంలోనైనా సరే.. విజయపథంలో రాణిస్తారు. సీఎం జగన్ కోరుకునేది కూడా ఇదే. ఇంగ్లీష్ రాకపోవడం వల్ల యువత ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కోల్పోకూడదు. అలా జరగకూడదంటే.. ప్రాథమిక స్థాయి నుంచే విద్యావ్యవస్థలో మార్పు రావాలి. అందుకే ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం తీసుకువచ్చారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అని పాఠశాలల్లో ఇదే విధమైన ప్రగతి కనిపిస్తే.. చాలా మంది తమ బిడ్డలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పిస్తారు. అప్పుడు ‘‘చదువుకోనే పరిస్థితి’’ పోయి.. ‘‘చదువుకునే పరిస్థితి’’ వస్తుంది. అలానే జరగాలని సీఎం జగన్ ఆకాంక్ష కూడా. ఎందుకంటే పిల్లలకు మనం ఇచ్చే అతి విలువైన ఆస్తి చదువు. ఆ చదువు కోసం ఏ తల్లిదండ్రులు కూడా ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంతో సీఎం జగన్ ఇంగ్లీష్ మీడియం ప్రారంభించారు. ఇక ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రారంభించి తమ పిల్లల భవిష్యత్తుకు బలమైన పునాది వేశారంటూ సీఎం జగన్‌పై విద్యార్థుల తల్లిదండ్రులు ప్రశంసలు కురిపిస్తున్నారు.