టీడీపీ యువనేత నారా లోకేష్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యువగళం పాదయాత్ర.. శుక్రవారం ఉదయం 11.03 నిమిషాలకు ప్రారంభమైంది. టీడీపీ నేతలు, వేలాది మంది కార్యకర్తలు.. పాదయాత్రలో పాల్గొనడానికి వచ్చారు. కుప్పం నుంచి ప్రారంభమైన పాదయాత్రలో పాల్గొనడం కోసం నందమూరి తారకరత్న కూడా వచ్చారు. లోకేష్‌తో పాటు పాదయాత్రలో పాల్గొన్నారు. ఈ క్రమంలో కుప్పం మసీదులో లోకేష్, టీడీపీ నేతలు, తారకరత్న.. ప్రార్థనలు చేసి.. బయటకు వస్తుండగా.. ఉన్నట్లుండి తారకరత్న స్పృహ తప్పి పడిపోయాడు. వెంటనే ఆయనను కుప్పం కేసీ ఆస్పత్రికి తరలించి ప్రథమ చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం కుప్పం పీఈఎస్ ఆస్పత్రికి తరలించారు.
తారకరత్నకు గుండెపోటు వచ్చిందని.. స్టంట్ వేశామని వైద్యులు వెల్లడించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని.. వైద్యం కొనసాగుతుందని తెలిపారు. గుండెకు వెళ్లే రక్త నాళాల్లో బ్లాక్‌లు ఉన్నట్లు గుర్తించామని.. తదుపరి చికిత్స అందిస్తునట్లు వైద్యులు తెలిపారు.