అమ్మ ప్రేమ గురించి.. బిడ్డల కోసం ఆమె చేసే త్యాగాల గురించి ఎంత చెప్పినా తక్కువే. మరి తన మీద అంతులేని ప్రేమ చూపిన తల్లి మీద తనకున్న ప్రేమను చాటుకోవడం కోసం ఓ వ్యక్తి ఏకంగా 10 కోట్ల రూపాయల ఖర్చుతో ఆలయం నిర్మిస్తున్నాడు. ఆ వివరాలు..
అమ్మ అనే పదానికి అర్థం.. ఆమె పంచే ప్రేమకి విలువకట్టగలిగే వారు.. సంపద ఈ లోకంలోనే లేదు. క్రూర మృగం సైతం.. తన బిడ్డలను కడుపులో పెట్టుకుని చూసుకుంటుంది. అది అమ్మతానికి ఉన్న ప్రత్యేకత. తన ప్రాణాలు పోతాయని తెలిసి కూడా.. మరో ప్రాణాన్ని ఈ భూమ్మీదకు తీసుకురావడం కోసం సంతోషంగా అంగీకరించే ఏకైక వ్యక్తి అమ్మ. ఆమె ప్రేమకు దైవమే దాసోహం అంటుంది. అలాంటి అమ్మకు ఏమిచ్చినా తక్కువే.. ఎన్ని జన్మలెత్తతినా తన రుణం తీసర్చుకోలేరు. అయితే నేటి కాలంలో కొందరు బిడ్డలు తల్లి పట్ల ఎంత దారుణంగా ప్రవర్తిసున్నారో.. కొందరు మహిళలు.. అమ్మ అనే మాటలకు ఎలా కళంకం తెస్తున్నారో చూస్తూనే ఉన్నాం. కానీ బిడ్డల మీద నిస్వార్థమైన ప్రేమ పంచే తల్లులు ఎందరో ఉన్నారు. అలానే కన్నవాళ్లని దైవంగా భావించే బిడ్డలు కూడా ఉన్నారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయేది ఈ కోవకు చెందిన ఓ కొడుకు కథ. తల్లిని దైవంగా భావించి.. ఆమె పేరు మీద కోట్ల రూపాయల ఖర్చుతో గుడి నిర్మిస్తున్నాడు ఓ కొడుకు. ఆ వివరాలు..
సాధారణంగా కోరిన కోర్కెలు తీరిస్తే దేవుడికి ఆలయం కట్టడం, ఆభరణాలు సమర్పించడం చేస్తారు. కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోయే వ్యక్తి మాత్రం.. తల్లికి గుడి కట్టి ఆమె మీద తన ప్రేమను చాటుకున్నాడు. అతడే శ్రీకాకుళం జిల్లాకు చెందిన సనపల శ్రావణ్ కుమార్. గుడి అంటే అదేదో నాలుగు గోడలు… పైన కప్పు.. దానిలో తల్లి విగ్రహం.. ఇలా సింపుల్‌గా కాదండోయ్.. కోట్లు ఖర్చు చేసి ఆలయం నిర్మిస్తున్నాడు. అతడు నిర్మించే అమ్మ ఆలయానికి 10 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. ఆలయాన్ని ఏకకృష్ణ శిలతో అద్భుతంగా నిర్మిస్తున్నాడు. మరి శ్రావణ్ కుమార్ ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నాడు.. అతడి వివరాలు అంటే..
శ్రావణ్ కుమార్ తండ్రి టీచర్.. తల్లి అనసూయాదేవి గృహిణి. ఈ దంపతులకు తొలుత ఇద్దరు కవలలు జన్మించారు. వారిలో ఒకరు పట్టగానే చనిపోగా.. మరొకరు 9వ ఏట క్యాన్సర్‌తో కన్ను మూశాడు. ఆ తర్వాత కొంత కాలానికి శ్రావణ్ కుమార్ జన్మించాడు. ఇద్దరు బిడ్డల మరణం తర్వాత జన్మించిన శ్రావణ్ కుమార్ అంటే అనసూయాదేవికి ప్రాణం. కళ్లల్లో పెట్టి చూసుకుంది. ఇక శ్రావణ్ కుమార్ కూడా.. తల్లి చూపిన మార్గంలో నడుస్తూ.. బాగా చదువుకుని.. జీవితంలో మంచి స్థాయిలో స్థిరపడ్డాడు. ప్రస్తుతం రియల్‌ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు.
ఇలా ఉండగా.. 2008లో శ్రావణ్ కుమార్ తల్లి.. ఆపరేషన్ వికటించి మృత్యువాత పడింది. తనను కంటికి రెప్పలా కాచి.. ఆకాశమంత ప్రేమను పంచి.. అల్లారుముద్దుగా పెంచిన తల్లి.. అలా దూరమవ్వడంతో.. శ్రావణ్ కుమార్ తట్టుకోలేకపోయాడు. తల్లి జ్ఞాపకాలతోనే కాలం వెళ్లదీస్తున్నాడు. ఇలా ఉండగా ఓ రోజు.. అతడికి తల్లికి గుడి కట్టాలనే ఆలోచన వచ్చింది. వెంటనే తన సొంతూరు వెళ్లి.. దీనికి సంబంధించిన కార్యక్రమాలు ప్రారంభించాడు. అలా 2019, మార్చి నెలలో గుడి నిర్మాణానికి శ్రీకారం చుట్టాడు.
అయితే తన తల్లి పేరు మీద నిర్మించే ఆలయం సాదాసీదాగా ఉండకూడదని భావించాడు శ్రావణ్ కుమార్. అందుకే ఆలయ నిర్మాణం కోసం భారీగా ఖర్చు చేయడానికి ముందుకు వచ్చాడు. తన తల్లి పేరు మీద నిర్మించే ఆలయం కోసం యాదాద్రి ఆలయ నిర్మాణ స్తపతుల్లో ఒకరైన బలగం చిరంజీవి, తమిళనాడుచు చెందిన శిల్పి పాండీదురై, ఒడిశాకు చెందిన శిల్పకారులు సురేష్ బృందాన్ని ఆలయ నిర్మానం కోసం తీసుకువచ్చాడు. ఈ ఆలయం ఎత్తు 51 అడుగులు. మూల విరట్టుగా శ్రావణ్ కుమార్ తల్లి విగ్రహం చెక్కిస్తున్నారు.
భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల సంస్కృతి, నాగరికతను పరిగణలోకి తీసుకొని, పంచగోపురాలతో ఈ గుడిని నిర్మిస్తున్నారు. అమ్మ ప్రేమను తెలిపే చిత్రాలను ఆలయ నిర్మాణంలో వాడనున్నారు. కృష్ణశిలలతో ఈ ఆలయ నిర్మాణం చేపడుతున్నారు. శ్రావణ్ కుమార్ నిర్ణయంపై జనాలు ప్రశంసలు కురిపిస్తున్నారు. మరి శ్రావణ్ కుమార్ చేస్తోన్న పనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.