ఈ మధ్యకాలంలో సోషల్ మీడీయా వాడకం బాగా పెరిగిపోయింది. చాలా మంది తమకు సంబంధించిన ఫోటోలను, ఇతర వీడియోలను షేర్ చేస్తుంటారు. మరికొంతమంది వెరైటీగా ఫోటోలు దిగి సోషల్ మీడియాలో షేర్ చేయాలనే సాహసలు చేస్తుంటారు. ఇలా ఫోటో సరదాలు ప్రాణాలను తీస్తున్నాయి. సోషల్ మీడియాలో వెరైటీ ఫోటోలు షేర్ చేయాలనే మోజులో 22 ఏళ్ల యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. పాముతో జాగ్రత్తగా ఉండాల్సింది పోయి.. దాంతో సెల్ఫీ దిగేందుకు ప్రయత్నించి నిండునూరేళ్ల జీవితాన్ని కోల్పోయాడు. ఈ ఘటన ప్రకాశం జిల్లాలో చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
ప్రకాశం జిల్లా తాళ్లూరు మండలం బొద్ది కూరపాడుకు చెందిన పోలంరెడ్డి రాఘవరెడ్డి, సరస్వతి దంపతలకు ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్ద వాడు మణికంఠా రెడ్డి(22) డిగ్రీ పూర్తి చేసి కుందకూరు ఆర్టీసీ డిపో సమీపంలో లస్సీ దుకాణం నిర్వహిస్తున్నాడు. అలా కుటుంబానికి ఆర్ధికంగా చేదోడువాదోడుగా మణికంఠా రెడ్డి ఉండేవాడు. అయితే అతడి ఫోటోలు దిగే అలవాటు బాగా ఉంది. తరచూ అనేక సెల్ఫీ ఫోటోలు, ఇతర వెరైటీ పిక్స్ దిగుతుండే వాడని సమాచారం. మంగవారం రాత్రి వెంకటస్వామి అనే వ్యక్తి పామును ఆడిస్తూ మణికంఠ నడుపుతున్న లస్సీ దుకాణం వద్దకు వచ్చాడు. పామును మెడలో వేసుకుని ఫోటో దిగాలని మణికంఠ సరదా పడ్డాడు. ఈ నేపథ్యంలో పక్కనే ఉన్న దుకాణంలో పనిచేస్తున్న యువకుడిని పిలిచాడు.
తన సెల్ ఫోన్ ఆ యువకుడికి ఇచ్చి.. ఫోటోలు, వీడియోలు తీయాలని చెప్పి.. ఆ పామును మెడలో వేసుకున్నాడు. అయితే పొరపాటున జారీ పాము కింద పడిపోయింది. తిరిగి దాన్ని మెడలో వేసుకునేందుకు పైకి లాగడు. ఈ ప్రయత్నంలో పాము.. మణికంఠ చేతిపై కాటేసింది. దీంతో కుటుంబ సభ్యులు అతడిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ప్రథమ చికిత్స అనంతరం పరిస్థితి విషమంగా ఉందని ఒంగోలు రిమ్స్ కు తీసుకెళ్లాలని వైద్యులు తెలిపారు. ఈ క్రమంలో ఒంగోలులోని రిమ్స్ కు తీసుకెళ్లగా.. అప్పటికే మృతి చెందినట్లు అక్కడి వైద్యులు తెలిపారు. కుటుంబ సభ్యులు మృతదేహాన్ని అర్ధరాత్రి సమయంలో బొద్దికూరపాడు తీసుకెళ్లారు.
అయితే కుందకూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో.. ఫోన్ లో ఉన్న ఫోటోలు చూస్తే తల్లిదండ్రులు మందలిస్తారని మణికంఠ డిలీట్ చేయించినట్లు తెలుస్తోంది. రాఘవరెడ్డి, సరస్వతి దంపతుల చిన్న కుమారుడు ఇంద్రారెడ్డి కూడా అనారోగ్య సమస్యతో చనిపోయినట్లు బంధువులు తెలిపారు. తాజాగా పెద్ద కుమారుడు కూడా ఇలా పాము కాటుతో తిరిగి రాని లోకానికి వెళ్లడంతో తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. మృతుడి తల్లిదండ్రులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మరి.. సెల్ఫీ పిచ్చితో యువకులు ఇలా ప్రాణాల కోల్పోతుండటంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.