ఏపీలోని ప్రభుత్వ పాఠశాలల్లో కొత్త హాజరు విధానం అమలులోకి రాబోతుంది. ఇప్పటి వరకూ ఉన్న బయోమెట్రిక్, ఐరిస్ హాజరు విధానం స్థానంలో ఫేషియల్ రికగ్నిషన్ విధానాన్ని తీసుకొచ్చింది విద్యాశాఖ. ఉపాధ్యాయులతో సహా ఇతర సిబ్బందికి కలిపి ఒకే హాజరు విధానాన్ని ఆగస్ట్ 16 నుండి అందుబాటులోకి తీసుకురానుంది. పాఠశాల ప్రాంగణంలో మాత్రమే పని చేసే విధంగా ‘సిమ్స్-ఏపీ’ అనే సరికొత్త యాప్‌ను రూపొందించింది. ఉపాధ్యాయులు తమ స్మార్ట్ ఫోన్లలో యాప్ డౌన్‌లోడ్ చేసుకుని ఉదయం 9 గంటల్లోపు ఫేషియల్ రికగ్నిషన్‌తో లాగిన్ అయితే హాజరు పడుతుందని, ఒక్క నిమిషం ఆలస్యమైనా ఆరోజు ఆబ్సెంట్ పడుతుందని విద్యాశాఖ వెల్లడించింది. పాఠశాల సిబ్బంది అందరూ ఈ యాప్‌ను తమ ఫోన్లలో ఇన్‌స్టాల్ చేసుకోవాలని విద్యాశాఖ ఆదేశించింది.
యాప్‌లో లాగిన్ అవ్వడమే కదా ఎక్కడున్నా లాగిన్ అయిపోవచ్చు అనుకుంటే పొరపాటే. యాప్ జీపీఎస్ ఆధారంగా పాఠశాల గుర్తించబడుతుంది. కాబట్టి పాఠశాల ఆవరణలో మాత్రమే ఫేస్ రికగ్నిషన్‌తో లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ఎక్కడ లాగిన్ అయ్యారో అనేది యాప్‌లో తెలిసిపోతుంది. పాఠశాలలో కాకుండా ఇంకెక్కడ లాగిన్ అయినా అది ఆబ్సెంట్ కిందే లెక్క. అయితే గ్రామీణ ప్రాంతాలు, ఏజెన్సీ ప్రాంతాల్లో ఇంటర్నెట్ సౌకర్యం సరిగా ఉండదని కొంతమంది వాదిస్తున్నారు. ఒక్కోసారి బస్సులు ఆలస్యంగా వస్తాయని, కొంచెం ఆలస్యం అయినా ఆబ్సెంట్ పడితే ఉపాధ్యాయులకే నష్టం అని అంటున్నారు. కాగా ‘సిమ్స్-ఏపీ’ యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవద్దని ఏపీ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య ఉపాధ్యాయులకు సూచించింది. కానీ ఏపీ విద్యాశాఖ మాత్రం రేపటి నుండి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ నూతన హాజరు విధానాన్ని అమలులోకి తీసుకొస్తామని అంటోంది. మరి దీనిపై మీ అభిప్రాయమేంటో కామెంట్ చేయండి.