ఉపాధ్యాయుల బదిలీ మార్గదర్శకాలకు సంబంధించి ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది.
ఉపాధ్యాయుల బదిలీ మార్గదర్శకాలకు సంబంధించి గత ఏడాది డిసెంబర్ 10న ఏపీ ప్రభుత్వం జీవో 187ను జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆ జీవోను ఇప్పుడు ఉపసంహరించుకుంది ప్రభుత్వం. ఈ మేరకు ప్రభుత్వ న్యాయవాది వీకే నాయుడు హైకోర్టుకు జీవో ఉపసంహరణకు సంబంధించి మెమోను నివేదించారు. ఈ జీవో ఉపసంహరణకు సంబంధించి మెమోను కోర్టు దృష్టికి తీసుకొచ్చిన ప్రభుత్వ న్యాయవాది ఈ మేరకు వివరాలను కోర్టుకు సమర్పించారు. జీవో ఉపసంహరణకు సంబంధించి వివరాలను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గన్నమనేని రామకృష్ణ ప్రసాద్.. దీనిపై తగిన ఉత్తర్వులు ఇచ్చేందుకు వ్యాజ్యాలపై తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేశారు.
2022-23 విద్యా సంవత్సరానికి ఏప్రిల్ 30 చివరి పనిదినమని, 2023-24 విద్యా సంవత్సరానికి గాను జూన్ 12వ తేదీన పాఠశాలలు తిరిగి ప్రారంభమవుతాయని కోర్టుకు సమర్పించిన మెమోలో విద్యాశాఖ పేర్కొంది. ఈ నేపథ్యంలో జీవో 187, తదనంతరం జారీ చేసిన సవరణలను ఉపసంహరించుకోవాలని నిర్ణయించుకున్నట్లు విద్యాశాఖ స్పష్టం చేసింది. అయితే ఉపాధ్యాయుల బదిలీ మార్గదర్శకాలు మళ్ళీ రూపొందిస్తామని విద్యాశాఖ కోర్టుకు నివేదించిన మెమోలో పేర్కొంది.