ఈ మద్య కొంతమంది గురువులు డబ్బుకు కక్కుర్తి పడి పరీక్షా పేపర్లు లీక్ చేయడం.. మాస్ కాపీయింగ్ ని ప్రోత్సహించడం లాంటివి చేస్తున్నారు. విద్యార్థుల బంగారు భవిష్యత్ తీర్చిదిద్దే స్థానంలో ఉన్న ఉపాధ్యాయులే ఇలాంటి పనులు చేయడం వల్లో కష్టపడి చదివే విద్యార్థులు నిరాశ, నిస్పృహలకు లోనవుతున్నారు.
విద్యార్థుల భవిష్యత్ నిర్ణయించేది పరీక్షలు. ఉన్నత విద్యనభ్యసించి సొసైటీలో గొప్ప పొజీషన్ లో ఉండాలంటే.. ఒక్కో మెట్టు ఎక్కుతూ ఉండాలి. ఎంతో కష్టపడి పరీక్షలు రాసి ఉత్తీర్ణత సాధించి పై తరగతులకు వెళ్లాలి. మంచి మార్కులు సంపాదించడానికి విద్యార్థులు ఎంతో కష్టపడి చతువుతుంటారు. కానీ, ఈ మద్య కొంత మంది ఉపాధ్యాయులు పేపర్ లీక్ చేయడం, మాస్ కాపీయింగ్ ని ప్రోత్సహించడం వల్ల విద్యార్థుల భవిష్యత్ నాశనం అవుతుంది. ఎంతో కష్టపడి చదివిన వాళ్లు నిరాశకు లోనవుతున్నారు. సాధారణంగా పరీక్షల్లో మాస్ కాపీయింగ్ జరగకుండా అధికారులు పటిష్ట చర్యలు తీసుకుంటారు. ఇటీవల విద్యార్థులు రక రకాల పద్దతుల్లో కాపీయింగ్ కి పాల్పపడుతున్న విషయం తెలిసిందే. అలాంటి వారిపై చర్యలు తీసుకోకుండా డబ్బుకు కక్కుర్తి పడి వారిని మాస్ కాపీయింగ్ కి ప్రోత్సహించిన నంద్యాల జిల్లాకు చెందిన ఏనిమిది మంది ఉపాధ్యాయులకు ఏపీ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. పూర్తి వివరాల్లోకి వెళితే..
ఏపీ నంద్యాల జిల్లాలో ఎనిమిది మంది ఉపాధ్యాయులకు ప్రభుత్వం గట్టి షాక్ ఇచ్చింది. త్వరలో జరగబోయే పదో తరగతి పరీక్షల సమయంలో ఆ ఉపాధ్యాయులను పోలీస్ స్టేషన్ లో ఉంచాలని నంద్యాల డీఈవో ఉత్తర్వులు జారీ చేశారు. దీనికి కారణం గత ఏడాది పదవ తరగతి పరీక్షల సందర్భంగా మాస్ కాపీయింగ్ ఘటనను దృష్టిలో ఉంచుకొని డీఈవో ఈ నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తుంది. ఈ ఏనిమిది మంది ఉపాధ్యాయులు గత ఏడాది టెన్త్ ఎగ్జామ్స్ జరుగుతున్న సమయంలో విధులు నిర్వహించారు. ఆ సమయంలో పరీక్షా కేంద్రంలో మాస్ కాపీయింగ్ పెద్ద ఎత్తున జరిగినట్లు తెలుస్తుంది. అప్పట్లో ఈ వ్యవహారం పెద్ద దుమారం రేపింది.
ఈ వ్యవహారాన్ని దృష్టిలో ఉంచుకొని ఇలాంటి ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా చర్యలు చేపట్టే క్రమంలో సదరు ఉపాధ్యాయులను ఈ ఏడాది పోలీస్ స్టేషన్ లో ఉంచాలని నంద్యాల డీఈవో అనురాధ ఉత్తర్వులు జారీ చేశారు. నంద్యాల జిల్లా కలెక్టర్ మనజీర్ జిలానీ సామూన్ ఆదేశాల మేరకు ఈ ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలుస్తుంది. వారు పనిచేసే మండలాల్లోని పోలీస్ స్టేషన్ లో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు స్టేషన్ లో ఉంచాలని ఉత్తర్వులో పేర్కొన్నారు. ఏపీలో ఏప్రీల్ 3 నుంచి 18 వరకు పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 8.45 నుంచి 9.30 గంటల వరకు విద్యార్థులు పరీక్ష హాల్ లో ఉండాలని.. నిమిషం ఆలస్యం అయినా అనుమతించబోమని విద్యా కమీనర్ సురేష్ కుమార్ తెలిపారు.