టీచర్లు పాఠశాలలకు సరిగా హాజరు కాకుండా విద్యార్థుల భవిష్యత్తుకు నష్టం కలిగేలా వ్యవహరించే వారి పట్ల ఆ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సుదీర్ఘకాలం సెలవులో ఉంటున్న ఉపాధ్యాయులకు రిటైర్మెంట్ ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.
భావీ భారత పౌరులను తీర్చిదిద్దే భాధ్యత గురువులపైనే ఆధారపడి ఉంటుంది. విద్యార్థులకు విద్యా బుద్దులు నేర్పించి జీవితంలో ఉత్తములుగా, ఉన్నత స్థితిలో ఉండేందుకు తోడ్పడేవారు ఉపాధ్యాయులు. అందుకనే గురువులను దైవంతో సమానంగా కొలుస్తారు. ఈ మధ్యకాలంలో చోటుచేసుకుంటున్న కొన్ని సంఘటనలు టీచర్లపై ఉండే గౌరవం తగ్గుతుందనే చెప్పాలి. కొంత మంది టీచర్లు వారి ప్రవర్తనతో, వెకిలి చేష్టలతో విద్యార్థినుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తూ చెడ్డపేరును మూటగట్టుకుంటున్నారు. అయితే మరికొంత మంది ఉపాధ్యాయులు పాఠశాలలకు సరిగా రాకుండా వ్యక్తిగత వ్యవహారాలు చూసుకుంటూ విద్యార్థులకు అన్యాయం చేస్తున్నారు. అటువంటి ఉపాధ్యాయుల పట్ల ఓ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
సుధీర్ఘకాలం సెలవుల్లో ఉంటూ విద్యార్థుల భవిష్యత్తుకు అన్యాయం చేస్తున్న గవర్నమెంట్ టీచర్లకు తప్పనిసరి రిటైర్మెంట్ ఇచ్చే విధంగా ఆ రాష్ట్రప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనిని త్వరలో అమలు చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఆరు నెలలకంటే ఎక్కువ కాలం పాఠశాలకు హాజరు కాకుండా ఉంటున్న టీచర్ల లిస్ట్ ను తయారు చేసి, వారికి రిటైర్మెంట్ ఇచ్చి కొత్తగా నియామకాలను చేపట్టాలని ఉత్తరాఖండ్ ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన విషయాలను ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ధన్ సింగ్ రావత్ ఇటీవల తెలియజేశారు.
అయితే ఆ రాష్ట్రంలో ఇప్పటి వరకు విధులకు ఎగనామం పెట్టి పాఠశాలకు రాని టీచర్ల సంఖ్య 150 కి చేరిందని వారందరికి రిటైర్మేంట్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే కొంత మంది ఉపాధ్యాయులు వారు నియామకం పొందిన పాఠశాలకు వెళ్లేందుకు సరైన రవాణా మార్గం లేక విధులకు గైర్హాజరవుతున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు. ఇలా ఉపాధ్యాయులు విధులకు హాజరు కాకుండా, సుదీర్ఘకాలం సెలవుల్లో ఉండడంతో విద్యార్థుల భవిష్యత్తుపై ప్రభావం చూపనుడటంతో తప్పనిసరి పదవీ విరమణ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.